ఇరు అసెంబ్లీల్లో కాగ్ నివేదిక
పలు అంశాల్లో నిధుల వెచ్చింపులో నిర్లక్ష్యం
హైదరాబాద్,మార్చి26 (జనంసాక్షి) : కాగ్ నివేదికను ఆంధప్రదేశ్ ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే… ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిర్ణీత ప్రమాణాలకు లోబడి లేవని కాగ్ తెలిపింది. వైద్యకళాశాలలు, బోధనాస్పత్రులు ప్రమాణాలు పాటించట్లేదని పేర్కొంది. మెడికల్, పారామెడికల్ పోస్టులు భారీగా ఖాళీలున్నాయని వెల్లడించింది. ఐటీడీఏల్లో 51శాతం నిధులు మాత్రమే వినియోగించారు. ఆర్థిక రంగంలో 44శాతం ఖర్చు చేయలేదని గుర్తు చేసింది. సాధారణ రంగంలో 94శాతం నిధులు ఖర్చు చేయలేదు. అలాగే నీటిపారుదల, రహదారుల విభాగాల్లో పనులు, ప్రాజెక్టుల్లో పురోగతి లేదు. ప్రైవేటు భాగస్వామ్య లీజు ఒప్పందాల తప్పిదాల వల్ల రూ.665 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. మోటారు వాహనాలపై పన్ను విధింపు లోపం వల్ల రూ.460 కోట్ల రాబడి నష్టం జరిగిందని అన్నారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులు 36శాతమే వినియోగం అయ్యిందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెవిన్యూ రాబడులు పెరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఉమ్మడి రాష్టాల్రకు చెందిన కాగ్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం గురువారం సభ ముందు ఉంచింది. రెవిన్యూ రాబడులు ఏడాది 6.63శాతం పెరిగాయని, రూ.6,889 కోట్ల మేర రాబడులు పెరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, నిధుల వినియోగం ఆశించినంతగా జరగలేదని కాగ్ పేర్కొంది. ఇక నీటి పారుదల, రహదారుల విభాగాల్లో నిర్మాణపనులు, ప్రాజెక్టుల్లో పురోగతి లేదని వెల్లడించింది. 2014 మార్చి నాటికి అసంపూర్తిగా ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పెట్టుబడులు రూ.82,665 కోట్లుగా కాగ్ స్పష్టం చేసింది. దీంతోపాటు 2013-14లో కేటాయించిన నిధులను కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని తెలిపింది. వైద్యారోగ్య ప్రమాణాలను ఏ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలోనూ పాటించలేదని పేర్కొంది. ఔషదాలు, మందుల నిర్దేశిత ప్రమాణాలను వైద్య కళాశాలలు, టీచింగ్ ఆస్పత్రులు పాటించలేదని వివరించింది. వైద్య సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయలేదని తెలిపింది. ఎస్టీ సబ్ ప్లాన్ కు 6.6శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఐదేళ్లలో 3.9 మాత్రమే కేటాయించారని వివరించారు. ఐటీడీఏ నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని వివరించారు. 2009-14 మధ్య కాలంలో పాఠశాల భవన నిర్మాణాలు 19శాతం మాత్రమే పూర్తయ్యాయని, బంగారు తల్లి పథకం నిధులు సక్రమంగా వినియోగం కాలేదని కాగ్ వివరించింది.