ఇళ్లు కూల్చిన చోట యాత్ర ఎందుకు చేయలేదు?

` మూసీ బాధితులు హైదరాబాద్‌లో ఉంటే.. నల్గొండలో పర్యటనలా: కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూసీ యాత్రపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లో మూసీ బాధితులు ఉంటే.. నల్లగొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్‌ రెడ్డి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లెక్కడ, కాలిన కడుపులెక్కడ, నువ్‌ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ మూసీ దాహానికి అత్తాపూర్‌ ఆగమైందని, గోల్నాక గొల్లుమంటుందని, దిలుషుక్‌ నగర్‌ ఢీలా పడిరదన్నారు. నీ కుట్రలకు అంబర్‌ పేట్‌, అత్తాపూర్‌ అతలాకుతలం అవుతుంటే.. నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడని ప్రశ్నించారు. అయ్యా సంబరాల రాం బాబు.. నీ అన్యాయానికి ఆవేధనలు, ఆవేశాలు, ఆక్రందనలు వినిపిస్తున్నవి, కనిపిస్తున్నవి అక్కడ కాదు.. రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర అంటూ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. తేలు మంత్రం రానోడు పాము కాటుకు మంత్రం ఏసినట్లు.. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్‌ అంటూ మండిపడ్డారు. ‘‘మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరు హైదరాబాద్‌ లో మూసి బాధితులు ఉంటే-నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్‌ రెడ్డి ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ జన్మదినోత్సవ శుభాకాంక్షలు
సీఎం రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ ట్వీట్‌ చేశారు. విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్‌, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానని తెలిపారు. వారు కోరితే మీ బర్త్‌డే కేక్‌ కూడా కట్‌చేయిస్తానని చెప్పారు. కాగా, అరెస్టు భయంతో కేటీఆర్‌ మలేషియా వెళ్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ న్యూస్‌పేపర్‌ రాసుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిషాంక్‌ చేసిన ట్వీట్‌ను ఆయన కేటీఆర్‌ ట్యాగ్‌ చేశారు. కేటీఆర్‌ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ఇదంతా చేస్తున్నారని మాకు తెలుసని, జర్నలిజాన్ని జోక్‌గా మార్చవద్దంటూ క్రిషాంక్‌ అందులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో చాయ్‌ తాగుతూ ఈ వార్తను చదువుతూ ఉంటారని చెప్పారు.
సీఎం స్థాయిని దిగజారుతున్న రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి తనను అరెస్ట్‌ చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడని విమర్శించారు. మేఘా కృష్ణారెడ్డికి అనుకూలంగా సీఎం వ్యవహార శైలి ఉందని అన్నారు. ఈ విషయమై ఎక్స్‌ వేదికగా రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘దమ్ముందా..?’ అంటూ పలు ప్రశ్నలు వేశారు. ‘మేఘా కృష్ణారెడ్డిని సుంకిశాల ఘటనలో బ్లాక్‌ లిస్ట్‌ చేసే దమ్ముందా..?’ అని ప్రశ్నించారు. ‘మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసే దమ్ముందా..?’ అని ఎక్స్‌ వేదికగా క్వశ్చన్‌ చేశారు. ‘దమ్ముందా ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ను ఆయన ఈస్టిండియా కంపెనీని కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నుంచి తీసివేయడానికి..? దమ్ముందా లేదా..?’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘సీఎం అయ్యి ఉండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ లోపాల గురించి ప్రశ్నించే శక్తి రావడానికి మీకింకా ఎంత సమయం పడుతుంది..?’ అని కేటీఆర్‌ ఆంగ్లంలో ప్రశ్న వేశారు. ‘తెలంగాణకు తొలి ప్రాధాన్యం అనే ఆలోచన రావడానికి మీకు ఇంకా ఎన్ని రోజులు కావాలి..?’ అని నిలదీశారు. ఈ పోస్టుతోపాటు ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవీ’ అనే శీర్షికతో ప్రచురితమైన పత్రికా క్లిప్పింగ్‌ను కేటీఆర్‌ జత చేశారు.