ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో..  భారత్‌ దూసుకుపోతోంది


– ‘మేకిన్‌ ఇండియా’ గ్లోబల్‌ బ్రాండ్‌గా మారింది
– మొబైల్‌ ఫోన్ల తయారీలో నెం.1గా ఎదుగుతున్నాం
–  జపాన్‌ పర్యటనలో ప్రవాసాంధ్రులతో భేటీలో మోదీ
టోక్యో, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : భారత్‌ నాలుగేళ్ల కాలంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని సోమవారం ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. , సులభతర వాణిజ్య విధానంలో భారత్‌ దూసుకుపోతోందన్నారు. 2014లో నేను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సులభతర వాణిజ్య విధానంలో భారత్‌  ప్రపంచ బ్యాంకు ఇచ్చే ర్యాంకుల్లో 140వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 100వ స్థానానికి చేరుకుందని తెలిపారు. మరింత మెరుగైన ర్యాంకు సాధించే దిశగా వెళుతోందని వ్యాఖ్యానించారు. మేకిన్‌ ఇండియా ఇప్పుడు గ్లోబల్‌ బ్రాండ్‌గా మారిపోయిందని, కేవలం భారతీయుల కోసమే కాకుండా ప్రపంచ దేశాల కోసం నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. దీంతో భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా మారిందని, ముఖ్యంగా ఎలక్టాన్రిక్స్‌, ఆటోమొబైల్‌ తయారీ రంగాల్లో గొప్ప సేవలను అందిస్తోందని అన్నారు. మొబైల్‌ ఫోన్ల తయారీలో అగ్రస్థానంలో నిలిచే దిశగా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నామని మోదీ తెలిపారు. గత ఏడాది మా ఇస్రో శాస్త్రవేత్తలు ఒకేసారి 100ఉపగ్రహాలను
విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని తెలిపారు. చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌లను అతి తక్కువ ఖర్చుతో ప్రయోగించించారని, 2022లో గగన్‌యాన్‌ చేపట్టడానికి ఇప్పుడు సిద్ధమవుతోందని మోదీ అన్నారు. భారత్‌లో ప్రతి ఏడాది అక్టోబర్‌ 31న సర్దార్‌ పటేల్‌ జయంతి వేడుకను  రాష్టీయ్ర ఏక్తా దివాస్‌గా జరుపుతున్నామన్నారు. ఈ సారి గుజరాత్‌లో ఆయన అతి పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నామని చెప్పారు. కాగా, ప్రవాస భారతీయులతో సమావేశమైన అనంతరం ఆయన భారత్‌, జపాన్‌ వ్యాపారవేత్తలతో భేటీలో పాల్గొన్నారు. అలాగే, జపాన్‌ విదేశాంగ మంత్రి టారో కోనోతో సమావేశమై ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.