ఈనెల 29న 100 అడుగుల జాతీయ జెండా ప్రతిష్టాపనోత్సవం
– ఉమ్మడి జిల్లాలోనే ఎత్తైన జెండా తొర్రూరు లో ఏర్పాటు
– జాతీయ పతాక ప్రతిష్టాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు
తొర్రూరు:27 ఆగస్టు (జనంసాక్షి )
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఈనెల 29న తొర్రూరు లో ప్రారంభించనున్నట్లు జాతీయ పతాక ప్రతిష్టాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు తెలిపారు.డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100 అడుగుల జాతీయ పతాకం ఏర్పాట్లను శనివారం ప్రజా ప్రతినిధులు, ప్రతిష్టాపన కమిటీ సభ్యులతో కలిసి కమిటీ చైర్మన్ సోమేశ్వరరావు పర్యవేక్షించారు. మునిసిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, స్థానికులతో కలిసి పనులు పరిశీలించి సూచనలిచ్చారు.
ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ.
ఈనెల 29న ఏర్పాటు చేయనున్న జాతీయ పతాకం 100 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు కలిగి ఉందన్నారు. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లో 280 ఫీట్ల జాతీయ పతాకం ఏర్పాటు చేశారని దాని తర్వాత ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద జాతీయ పతాకం తొర్రూరు లో 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారన్నారు.
జెండా కింద ప్లాట్ ఫాం ఏర్పాటు చేసి నాలుగు ఎల్ఈడి లైట్లను చేస్తున్నామని, ఇస్రోలో పనిచేసే ప్రత్యేక నిపుణులతో జెండాతో పాటు 100 అడుగుల స్తంభాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం రూ.20 లక్షల ఖర్చుతో భారీ జెండాను ప్రతిష్టిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 29న ఉదయం 10 గంటలకు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే జాతీయ పతాక ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నారని, వీరితోపాటు ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని ముఖ్య కేంద్రమైన తొర్రూరు లో జాతీయ జెండా ఏర్పాటు గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామం, తదనంతర జాతి నిర్మాణంలో మువ్వన్నెల పతాక పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం తన, మన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని వారి త్యాగాల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే గొప్ప సంకల్పంతో తొర్రూరు లో భారీ జాతీయ పతాకాన్ని ప్రతిష్టిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున హాజరై జాతీయ స్ఫూర్తిని చాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రతిష్టాపన కమిటీ సభ్యులు శామకూరి ఐలయ్య, కుర్ర శ్రీనివాస్, దొంగరి శంకర్, ధరావత్ జై సింగ్, చీకటి శ్రీనివాస్ గౌడ్, కందాడి అశోక్ రెడ్డి, కౌన్సిలర్ గుగులోతు శంకర్,షాట్ అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి, జర్నలిస్టులు దూలం శ్రీనివాస్, యాదగిరి నాయక్,రాంబాబు స్థానికులు కిషన్ నాయక్, జాటోతు సాయి కృష్ణ, రాయిపల్లి యాకయ్య, కొమ్ము దేవేందర్, జాటోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు.