ఈ ఏడాది ప్రపంచంలో ఇదే అతి పెద్ద తుపాను
టుగ్యేగరావ్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో అతి పెద్దదైన తుపాను శనివారం ఫిలిప్పీన్‌ను తాకింది. మంగ్‌ఖుట్ సూపర్ టైఫూన్‌గా పిలిచే ఈ తుపాను ధాటికి ఆ దేశ ఉత్తర తీర ప్రాంతం విలవిల్లాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో విపత్తులు సంభవించే దేశంగా ఫిలిప్పిన్‌కు పేరుంది. దక్షిణ చైనా సముద్రం తీరాన ఉన్న ఈ దేశానికి ఏటా కనీసం 20 తుపాన్లు వస్తుంటాయి. తాజాది 15వది కావడం గమనార్హం. స్థానికంగా వీటిని ఓంపాంగ్ అని పిలుస్తారు. సూర్యోదయం కాకమునుపే గంటకు 200 కి.మీ. నుంచి 330 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీయడం ప్రారంభించాయి. 20 అడుగుల ఎత్తు వరకు సముద్ర అలలు ఎగిసిపడుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురుగాలులకు తోడు భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమయింది. లుజోన్ దీవితోపాటు, కాగయాన్, ఉత్తర ఇసబెల, అపయావో, అబ్రా రాష్ట్రాలు టైఫూన్ ప్రభావానికి లోనయ్యాయి. ఇంతవరకు 12 మంది మృతి చెందినట్టు, మరో ఆరుగురు గల్లంతయినట్టు తెలిసింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విమాన, నౌకాయాన సేవలను రద్దు చేసింది. నాలుగో శ్రేణి హెచ్చరికలను జారీ చేసింది. 2013లోనూ దాదాపు ఇంత తీవ్రమైన సూపర్ టైఫూన్ హైయాన్ సంభవించడంతో దాదాపు 7,300 మంది ప్రాణాలు కోల్పోయారు.