ఈ యేడు ఎండలు దంచడం ఖాయం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): బ్రిటన్‌ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 2014-2023 దశాబ్దం 150 ఏళ్ళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే దశాబ్దంగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది. రాబోయే ఐదేళ్ళలో ఉష్ణోగ్రతల పరిస్థితులను వివరిస్తూ, ప్రీ ఇండస్టియ్రల్‌  లెవెల్స్‌ కన్నా 1 డిగ్రీ సెంటిగ్రేడ్‌ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నట్లు పేర్కొంది. 2015లో మొట్టమొదటిసారి ప్రీ ఇండస్టియ్రల్‌ లెవెల్‌ కన్నా 1 డిగ్రీ అధికంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది. అప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది. ఈ పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని తెలిపింది. తాత్కాలికంగానే అయినా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. ఉష్ణోగ్రతల నమోదు 1850 నుంచి మొదలైంది. 2018లో నమోదైన ఉష్ణోగ్రతలు నాలుగో అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలని వెల్లడైంది.