హైదరాబాద్‌కు.. ఇవాళ మరో వంతెన అందుబాటులోకి వచ్చింది.. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఫోర్ లైన్ స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్‌లింగంపల్లి వీఎస్టీ జంక్షన్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గిపోనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జికి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటి వరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీది నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వెైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాలు పట్టేది.. స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చని మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టడంపై నాయిని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ పోగ్రామ్ (ఎస్ఆర్ డీపీ) లో భాగంగా హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులను పూర్తిచేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటిలో 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో 3 ఇతర పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. తాజాగా మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించిన వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి ఇందులో 36 వ ప్రాజెక్టు అని ప్రభుత్వం వెల్లడించింది.