ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం

– ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గం
– పాక్‌లో ఉగ్రమూకలను ఏరిపారేస్తాం
– వారికి అనుకూలంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్‌
– లాతూర్‌ ప్రచార సభలో ప్రధాని మోడీ
లాతూర్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు విశ్రమించేది లేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని కూడా అన్నారు. భారత రక్షణ అన్నది తమ ప్రథమ కర్తవ్యం అన్నారు. పొరుగు దేశంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకలను ఏరిపారేయడానికి ఏమాత్రం వెనకాడేది లేదని ఇప్పటికే నిరూపించామన్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు పాక్‌ హస్తం అందిస్తోందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కూడా పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశ విభజనకు కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలన్న నినాదానికి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో ప్రజల మద్దతు, ఆశీర్వాదాలతోనే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగానని మోదీ వెల్లడించారు. ప్రజల విశ్వాసం చూరగొనడమే తనకు ఓ పెద్ద విజయమన్నారు. ఉగ్రవాదంతో పాటు మావోయిస్టు, నక్సల్స్‌ సమస్యను కూడా పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. వైమానికదళ దాడుల గురించి గత మేనిఫెస్టోలో ప్రస్తావించనప్పటికీ అవసరమైనప్పుడు అలాంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడలేదని గుర్తుచేశారు. అలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి తొలి ఓటు అంకితం చేయాలని తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారిని కోరారు. ఓవైపు కాంగ్రెస్‌ కుటుంబ సంక్షేమానికి పాల్పడుతుంటే మరోవైపు బాల్‌ ఠాక్రే లాంటి నేతలు పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టి ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన దాన్ని నిరాకరించారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. తాగు నీటి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఆదాయపు పన్ను శాఖ సోదాల గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఐటీ అధికారులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అలాగే సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోలోని పలు అంశాలను మోదీ ప్రజలకు వివరించారు. తొలి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడంతో మోదీ ఈరోజు మొత్తం నాలుగు సభల్లో పాల్గొననున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో సభ ముగియగా.. ఇంకా తమిళనాడు, కర్ణాటకలో జరిగే మరో మూడు ప్రచార సభల్లో ఆయన మాట్లాడనున్నారు.