ఉగ్రవాదుల చర్యలను..  ఐక్యంగా తిప్పికొట్టాలి


– ఈ విషయంలో జవాన్లకు, కేంద్రానికి మద్దతుగా నిలుస్తాం
– ఇలాంటి విషయాల్లో రాజకీయాలకు తావులేదు
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : ఉగ్రవాదుల దాడిలో జవాన్ల మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు అన్నారు. ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ,
మృతిచెందిన జవాన్లకు నివాళులర్పించినట్లు తెలిపారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. జవాన్లకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని వారు అన్నారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కావాల్సినన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇది విషాదకరమైన రోజు అని, సైన్యానికి చెందిన సుమారు 40మంది జవాన్ల ప్రాణాలను ఈ దేశం కోల్పోయిందని, ముందుగా మనం వారి కుటుంబాలకు స్వాంతన కల్పించాలని మన్మోహన్‌ అన్నారు. విపక్షాలన్నీ జవాన్లకు, ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తున్నాయని అన్నారు. సైన్యానికి, ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని, ఈ విషయంలో మరో ప్రస్తావన లేదని రాహుల్‌ అన్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైందని, భద్రతా దళాలపై ఇటువంటి దాడి జరగడం అత్యంత హేయంగా ఉందని, దేశాన్ని విభజించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు వ్యవహరిస్తున్నారని, కానీ తాము డివైడ్‌ కాబోమని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దీనిపై ఎలాంటి వివాదం చేయదలుచుకోలేదని తెలిపారు. రాబోయే కొద్దిరోజులు ఈ ఘటనపై మేము ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. ఉగ్రవాద విషయంలో అందరితో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జవాన్ల కుటుంబాలకు అండగా నిలబడుతుంది. వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టంచేశారు.