ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాం

– ఎంతమంది చనిపోయారనేది చెప్పడం మాపనికాదు
– వివరాలను ప్రభుత్వమే వెల్లడిస్తుంది
– అభినందన్‌ ఫిట్‌గా ఉంటే త్వరలోనే కాక్‌పిట్‌లోకి వస్తాడు
– వాయుసేనాధిపతి బీఎస్‌ ధనోవా
కొయంబత్తూర్‌, మార్చి4(జ‌నంసాక్షి) : జైషే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా వాయుసేన మెరుపు దాడులు చేసిందని వాయుసేనాధిపతి బీఎస్‌ ధనోవా అన్నారు. సోమవారం కొయంబత్తూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  ‘ఎక్కడెక్కడ దాడి చేయాలనే లక్ష్యాలపైనే మా దృష్టి ఉంటుందన్నారు. మా పనంతా లక్ష్యం నెరవేరిందా అనేదే చూస్తామని, అంతేగానీ చేసిన దాడుల్లో ఎంతమంది చనిపోయారు అన్నది ఎయిర్‌ఫోర్స్‌ లెక్కించదన్నారు. ఈ దాడిలో మా లక్ష్యం నెరవేరిందని ఆయన తెలిపారు. బాలాకోట్‌ శిబిరంలో హతమైన ఉగ్రవాదుల సంఖ్యను వెల్లడించడం వంటివి ప్రభుత్వమే చూసుకుంటుందని ధనోవా తెలిపారు. అక్కడ ఎంతమంది ఉన్నరాన్న దాన్ని బట్టి మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాజకీయాలపై తాను స్పందించబోనని, అయితే అభినందన్‌ స్వదేశానికి రావడం ఆనందంగా ఉందన్నారు. అభినందన్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆరోగ్యపరంగా ఆయన ఫిట్‌గా ఉంటే త్వరలోనే కాక్‌పిట్‌లోకి వస్తారని తెలిపారు.  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరంపై భారత వాయుసేన మెరుపుదాడి చేపట్టి వందల మంది ముష్కరులను
మట్టుబెట్టింది. అయితే ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నదానిపై ఇంతవరకూ స్పష్టమైన సమాచారం లేదు. అటు ప్రభుత్వం గానీ, ఇటు వాయుసేన గానీ మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. దీనిపై పలు ఆరోపణలు వస్తుండటంతో దాడిలో ఎంతమంది చనిపోయారన్నది తాము చెప్పలేమని వాయుసేనాధిపతి బీఎస్‌ ధనోవా స్పష్టం చేశారు. ఇదిలాఉంటే  భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 250 మందికి పైగా ముష్కరులను మట్టుబెట్టినట్లు చెప్పారు.