ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాలు.. 16 మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు దక్షిణాదితన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ సోమవారం ఎడతెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి.

ఉత్తరాఖండ్‌లో వర్షం ధాటికి ఐదుగురి మృతి
ఉత్తరాఖండ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వరుసగా రెండో రోజు.. సోమవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పౌరీ జిల్లాలోని లాన్స్‌డౌన్‌ సమీపంలోని సమ్‌ఖాల్‌లో వర్షం ధాటికి రాళ్లు జారిపడడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. వారు నివసిస్తున్న టెంట్‌పై రాళ్లు జారిపడ్డాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. వర్షాలు తగ్గి, పరిస్థితి చక్కబడేదాకా ముందుకెళ్లకూడదని చార్‌ధామ్‌ యాత్రికులకు అధికారులు సూచించారు.

చార్‌ధామ్‌ ఆలయాలకు జనాన్ని తీసుకెళ్లే వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వర్ష బీభత్సంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారులు, వంతెనల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రను మరో రెండు రోజుల పాటు నిలిపివేసుకోవాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన ప్రాంతాల్లోనే బస చేయాలని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీఎం ధామీతో ఫోన్‌లో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్తరాఖండ్‌కు అవసరమైన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.