ఉద్యమనేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్
వరంగల్,ఫిబ్రవరి14(జనంసాక్షి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలి చూస్తుంటే ముఖ్యమంత్రినని మరచి ఉద్యమనేతగా పరిపాలన సాగిస్తున్నారని మాజీమంత్రి, తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు బసవరాజు సారయ్య పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకే ఉద్యమాలని విభజన అనంతరం అందరూ సమానమేనన్న భావనతో అన్నదమ్ముల్లా మెలగాలన్నారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ప్రజల మనిషిగా కాకుండా నియంతగా పాలిస్తున్నాడన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు పేదవాడికి 3 ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, పేదలకు 2 పడకల గదులతో భవన సౌకర్యం, ఇంటింటికి మంచినీటి కుళాయి తదితర వాటిని గాలికొదిలేశాడన్నారు. సచివాలయాన్నిఎర్రగడ్డలో నిర్మించి ప్రభుత్వానికి చెందన సచివాలయ భూముల్లో 100 అపార్టుమెంట్లు నిర్మించి స్థిరాస్తి వ్యాపారాన్ని చేయాలని చూస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన తరగతులవారిని గుర్తించాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.