ఉపాధి కూలీలకు వేసవి భత్యం యధాతథం
వరంగల్,మార్చి9(జనంసాక్షి): ఉపాధి హావిూ పథకాన్ని కుదిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈసారి వేసవి భత్యం అమలుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఒక దశలో వేసవి భత్యాన్ని ఎత్తివేయాలని భావించారు. అయితే ప్రధాని ప్రకటనతో దీనిపై ప్రచారాలు ఉత్తవే అని తేలిపోయింది. తాజా ఆదేశాలతో ఆ అపోహాలన్నీ పటాపంచలయ్యాయి. వేసవి భత్యం అమలు తీరు గురించి మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలలో 30 శాతం, జూన్‌లో 20 శాతం చొప్పున వేసవి భత్యం జోడించి చెల్లిస్తామని అధికారులు వివరించారు. వేసవి భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర గ్రావిూణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలం నుంచి దీని గురించి స్పష్టత లేక అటు సిబ్బంది, ఇటు కూలీలు అయోమయంలో పడ్డారు. మార్చి నుంచి జూన్ వరకు ఈ వేసవి భత్యం వర్తింప చేయాలనే తాజా నిర్ణయంతో కూలీలు ఉపశమనం చెందారు. యూపీఏ హయాంలో ఉపాధి హావిూ పథకం అమల్లోకి వచ్చాక అనేక సార్లు నిబంధనలు సడలించారు. ప్రతి కుటుంబానికి ఏడాదిలో 100 రోజులకు తగ్గకుండా పని కల్పించడంతోపాటు రోజుకి గరిష్ఠంగా రూ.169 చొప్పున కూలీ గిట్టుబాటు అయ్యేలా చూడటం ఈ పథకం ముఖ్యోద్దేశం. వేసవిని దృష్టిలో పెట్టుకుని కూలీలకు వేసవి బథ్యం ఇస్తూ వచ్చారు. వేసవిలో చెమటోడ్చి పని చేసినా ఎక్కువ పని గంటలు చేయటం అసాధ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేసవి భత్యం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. 2010 నుంచే ఈ విధానం అమలవుతుంది. దీనిని ఈ యేడు కూడా కొనసాగించనున్నారు.