ఉమ్మడి జిల్లాలో నష్టం కోట్లలోనే

తోణ సహాయక చర్యల్లో అధికారులు
వరంగల్‌,మే4(జ‌నం సాక్షి): గాలి వాన  కారణంగా ఉమ్మడి జిల్లాలో  కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఈదురుగాలులకు మామిడి కాయలన్నీ రాలిపోయాయి. అనేక చోట్ల భారీ వృక్షాలు కూలాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి.
కనీవినీ ఎరుగని రీతిలో ప్రచండ గాలులు వీయడంతో రూ. కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది.
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ హరిత ప్రకటించారు.
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారిపై చెట్లు కూలి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కల్లాలలో ఆరబెట్టిన పసుపు తడిసి రైతులకు నష్టం జరిగింది. పరకాలలో మార్కెట్‌ యార్డును స్పీకర్‌ మధుసూదనాచారి పరిశీలించి, రైతులకు న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అకాల వర్షం ఈదురుగాలుల విషయాన్ని తెలుసుకున్న మంత్రి కడియం వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ, జయశంకర్‌ జిల్లాల కలెక్టర్లతో ఆయన నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యలను, నష్టాలను అడిగి తెలుసుకున్నారు. నష్టాలను అంచనా వేసి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించి విద్యుత్తు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడిసిన వరి, మొక్కజొన్నలను పౌర సరఫరాల కార్పొరేషన్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసే విధంగా రైతులకు భరోసా ఇవ్వాలని, ఇప్పటికే పంట పొలాల్లో తడిసిన పంట ఉత్పత్తులను కూడా విధిగా కొనుగోలు చేసి కనీస మద్దతు ధర అందజేయాలని తెలిపారు. అధికారులు బృందాలుగా ఏర్పడి నష్టాలపై రైతుల వారీగా అంచనా వేసి నివేదిక సమర్పించాలన్నారు. రహదారులపై విరిగిన చెట్లను వెంటనే తొలగించాలని, విరిగిన స్తంభాలను, తెగి పడిన కరెంటు తీగలను పునరుద్ధరించాలన్నారు