ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి కాంగ్రెస్‌ ప్రచారం

టిఆర్‌ఎస్‌ వైఫల్యాలపైనే ప్రధాన దృష్టి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా… కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోనుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూఉలో ప్రచారంతో అదరగొట్టిన కాంగ్రెస్‌ ఇక ఆదిలాబాద్‌లోనూ ప్రచారం చేయబోతోంది. అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రచారానికి పదును పెట్టబోతున్నారు. టిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించే కమిటీ పర్యటన ఖరారైంది. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క, కో చైర్‌పర్సన్‌ డీకే.అరుణ, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ప్రచారం సాగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌లలో మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. భైంసాలో ఇటీవలే రాహుల్‌గాంధీ ప్రచారసభను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ముథోల్‌, నిర్మల్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాగించనున్నారు. ఈ మేరకు రూట్‌ మ్యాప్‌ కూడా తయారైంది. అయితే ఇప్పటివరకు మహాకూటమిలో పొత్తులపైన స్పష్టత లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అండదండలతో పార్టీ టికెట్టు ఆశిస్తున్న వారంతా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా ఉండగా, మహేశ్వర్‌రెడ్డిని వ్యతిరేకించే వారంతా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నాయకత్వంలో భట్టి విక్రమార్క వర్గంగా టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌, కో చైర్‌పర్సన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే భట్టి, డీకేలకే అవకాశం లభించడం ఉమ్మడి జిల్లాలోని ప్రేంసాగర్‌రావు వర్గానికి ఊపునిచ్చింది. నవంతబర్‌ ఒకటి నుంచి నాలుగోతేదీ వరకు సాగే పర్యటనలో భట్టి వర్గీయులే ప్రముఖంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రచార కమిటీ పర్యటన కాబట్టి నాయకులంతా హాజరవుతారని, గ్రూపులతో సంబంధం ఉండదని జిల్లా నేతలు చెప్పారు.