ఉరిశిక్షను సమర్థించిన భారత్
అరుదైన కేసుల్లో మాత్రమే అమలు
ఐక్యరాజ్యసమితిలో భారత్ వివరణ
ఐక్యరాజ్య సమితి,నవంబర్14(జనంసాక్షి): ఉరిశిక్ష అమలుపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. భారత్ చట్టానికి ఇది వ్యతిరేకమని, అక్కడ అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్షను అమలు చేస్తారని పేర్కొంది. జనరల్ అసెంబ్లీ మూడవ కమిటీ (సామాజిక, మానవతావాద, సాంస్కృతిక) సమావేశంలో ఈ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించారు. రికార్డు స్థాయిలో 123 ఓట్లు అనుకూలంగా రాగా, 36ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. 30 దేశాలు గైర్హాజరయ్యాయి. ఉరి శిక్షను ఎదుర్కొంటున్న వారి హక్కుల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని అన్ని దేశాలకు ఈ తీర్మానం పిలుపిస్తోంది. వివక్షతతో కూడిన చట్టాల ప్రాతిపదికన ఉరి శిక్షను అమలు చేయరాదని
పేర్కొంటోంది. కాగా, ఐక్యరాజ్య సమితిలో భారత్ ఫస్ట్ సెక్రటరీ పౌలోమి త్రిపాఠి మాట్లాడుతూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంపై వివరణ ఇచ్చారు. భారత్‌లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉరి శిక్షను అమలు చేస్తున్నామని తెలిపారు. జరిగిన నేరం చాలా హేయమైనదై, సమాజాన్ని దిగ్భాంతికి
గురిచేసే సందర్భాల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తున్నామని చెప్పారు. స్వతంత్ర న్యాయ స్థానంలో ఎలాంటి అవకతవకలు లేని విచారణ జరిగేందుకు అవసరమైన అన్ని రక్షణలు భారత చట్టం కల్పిస్తోందని చెప్పారు. తీవ్రంగా చర్చ జరిగిన తర్వాత ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించారు. 34 దేశాల తరపున సింగపూర్ సవరణను ప్రవేశపెట్టగా ఆ సవరణను కూడా కమిటీ ఆమోదించింది.