ఎంపి పాదాలు కడిగించుకోవడంపై ఆగ్రహం

వెంటనే చర్య తీసుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌

చండీఘర్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిషిఖాంత్‌ దూబేపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో బిజెపి ఎంపి పాదాలను కడిగిన అనంతరం ఆ నీటిని తాగుతున్న వీడియో ఒకటి సోషల్‌విూడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. దీనిపై సుర్జేవాలా మాట్లాడుతూ తరచుగా ఇతరులను అవమానించడం, తమను తాము దేవుడిగా ప్రకటించుకునే సాంప్రదాయాలు విచ్ఛిన్నమైనా అహంకార ధోరణితో ప్రవర్తించే బిజెపి ఎంపి వంటి నేతలు వాటిని బహిర్గతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిజెపి నేతల అహంకారం అత్యున్నత స్థాయికి చేరుకుందని విమర్శించారు. కార్యకర్తలు, సామాన్య ప్రజలు వారి కాళ్లను కడిగి ఆ నీటిని తాగాలని కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. 21వశతాబ్దంలో కూడా వారి వల్ల ఇటువంటి అమానవీయమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే బిజెపి సంస్కృతా, నైతికతా అనేది ప్రధానిమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా తెలపాలని ప్రశ్నించారు. వారు దూబే పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారు కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ చర్యలను సమర్థిస్తున్నట్లేనని ఆయన పేర్కొన్నారు.