ఎకో టూరిజం అభివృద్దికి చర్యలు: కలెక్టర్‌

వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): జిల్లాలో ఎకో టూరిజపం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. జిల్లాలో ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన అర్బన్‌జిల్లాలో ఎకో టూరిజానికి విస్తృతావకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. ధర్మసాగర్‌ చెరువు వద్ద ఏర్పాటు చేసిన నైట్‌ క్యాంపింగ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్బన్‌ జిల్లా చారిత్రంగా సుప్రసిద్ధమే కాకుండా ప్రకృతి రమణీయతకు కూడా ఆలవాలం అన్నారు. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తగిన పోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. నైట్‌ క్యాంపింగ్‌ కోసం తొలుత పది టెంట్లనే ఏర్పాటు చేశామని, డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో వీటి సంఖ్యను పెంచుతామన్నారు. మొదటి రోజు క్యాంపింగ్‌కు విశేష స్పందన లభించిందన్నారు. యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. నైట్‌ క్యాం పింగ్‌కు సంబంధించి ‘ఎకోటూరిజయం వరంగల్‌’ పేరుతో ఫేస్‌బుక్‌లో పేజీని తెరిచామని, దీనిని చూసి లైక్‌ చేయవలసిందిగా కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో డీఎఫ్వో అర్పన, డీఆర్‌వో సురేష్‌, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.