ఎట్టకేలకు బాధితుల పరామర్శ
` లఖింపూర్‌ఖేరి బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రియాంకా,రాహుల్
` తమ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రూ.1 కోటి పరిహారం ప్రకటన
లక్నో,అక్టోబరు 6(జనంసాక్షి):హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రులు భూపేష్ బాఘెల్,చరంజిత్ సింగ్ చన్నీ లఖింపూరి ఖేరి వెళ్లి బాధితులను పరామర్శించారు. అంతకు ముందు సోమవారం నుంచి సీతాపూర్‌లోని పీఏసీ కాంపౌండ్‌లో నిర్భంధించిన పియాంకా గాంధీని నుంచి విడుదల చేశారు. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆదివారం జరిగిన సంఘటనలో మరణించిన రైతులు పాత్రికేయుల కుటుంబాలకు రాహుల్, ప్రియాంకాగాంధీ భూపేశ్ బఘేల్ ,చన్నీ ప్రభుత్వాల ద్వారా రూ .50 లక్షల చొప్పున మొత్తం కోటీ రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.కాగా లిఖింపూర్ ఖేరి హింసాకాండలో మొత్తం 9 మంది మరణించారు, వీరిలో నలుగురు కేంద్రమంత్రి బిజెపి ఎంపి అజయ్ కుమారుడు నడిపిన వాహనం ద్వారా ఢీకొట్టడం ద్వారా మృతి చెందారు. అంతేకాదు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్, ఎస్‌యూవీ వాహనంలోల ఒకదానిపై కూర్చుని నిరసనకారుల విూదకు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.అంతకు మందు రాహుల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల హక్కులను లాక్కోవడంతో పాటు ఒక పద్ధతి ప్రకారం వారిపై దాడులు జరుపుతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ‘రైతులపై వాహనాలు తోలుతున్నారు. హత్యలు చేస్తున్నారు. లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి పేర్లు బయటకు వచ్చాయి. నిన్ననే ప్రధాని లక్నోలో పర్యటించారు. లఖింపూర్ మాత్రం వెళ్లలేదు. రైతులపై క్రమ పద్ధతిలో జరుగుతున్నా దాడి ఇది’ అని రాహుల్ విమర్శించారు. నిందితులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షాల బాధ్యత అని, ప్రతిపక్షాలు ఆ పని చేయకుంటే హత్రాస్ ఘటనను పట్టించుకునే వారే కాదని అన్నారు.
(లఖింపూర్ ఖేరిలో హింసపై నేడు సుప్రీంకోర్టు విచారణ
` ఘటనను సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం)
దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):లఖింపూరి ఖేరిదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టనుంది. ఈ కేసును యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టడంపై నిరసనలు వ్యక్తమవుతుండడంతో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించాలని నిర్ణయించింది. మరోవైపు, ఈ కేసులో జోక్యం చేసుకొని సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ నిన్న యూపీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సీజేఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఘటనకు బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేయడంతో పాటు నిందితులకు శిక్షపడేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు. న్యాయవాదుల లేఖను పరిణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం లఖింపుర్ ఖేరిలో రైతులు తికోనియా`బన్బీపుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన చేస్తుండగా.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్ర తనయుడు ఆశిష్ మిశ్ర కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం రైతుల దాడిలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి తనయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసింది.