ఎన్‌సిపిలో రాఫెల్‌ చిచ్చు

పవార్‌తో విభేదించి రాజీనామా చేసిన తారిఖ్‌ అన్వర్‌
ముంబై,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): రాఫెల్‌ ఒప్పందం మరో రకంగా  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో చిచ్చు రేపింది. ఆ పార్టీని ఓ కుదుపు కుదిపింది. పార్టీ  అధ్యక్షుడు శరద్‌ పవార్‌కు సొంత పార్టీ ఎంపీ తారిఖ్‌ అన్వర్‌ షాక్‌ ఇచ్చారు. ఎన్‌సీపీ, లోక్‌సభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రఫేల్‌ ఒప్పదంలో ప్రధాని మోదీని సమర్ధిస్తూ పవార్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే అన్వర్‌ ఈ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తారిఖ్‌ అన్వర్‌కు ఎన్‌సీపీలో ప్రముఖ నేతగానే కాక, బీహార్‌ ముస్లిం నేతగా కూడా మంచి పేరుంది. ఎన్‌సీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా అన్వర్‌ ఉన్నారు. కాగా, అన్వర్‌ రాజీనామాను ఎన్‌సీపీ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ మజీద్‌ మెమన్‌ ధ్రువీకరించారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయలో మోదీపై ప్రజలకు ఎలాంటి సందేహాలు లేవని, యుద్ధ విమానాల సాంకేతిక వివరాలను వెల్లడించాలన్న ప్రతిపక్షాల డిమాండులో అర్ధం లేదని పవార్‌ గురువారంనాడు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.