ఎపిలో ఎన్నికల కమిషనర్‌ పర్యటన

రాజకీయ పార్టీలతో సునీల్‌ అరోరా చర్చలు
ఓట్ల తొలగింపు తదితర అంశాలపై పార్టీల ఫిర్యాదు
విజయవాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ,అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చించారు. వారు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఓట్ల గల్లంతు, వివిప్యాట్ల లెక్కింపు తదితర అంవానలు వారు ప్రస్తావించారు. విజయవాడ నోవోటెల్‌ ¬టల్‌లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాను పలువురు రాజకీయ పార్టీ నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత వై.వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తమ అభ్యంతరాలు, వినతులు లిఖిత పూర్వకంగా ఇచ్చామన్నారు. తెలంగాణలో మాదిరి ఓట్లు ఇక్కడ గల్లంతు కాకుండా చూడాలని కోరామన్నారు. ఐడీ కార్డులు ఉన్నా ఓటర్ల లిస్టులో అవి ఉండటం లేదని తెలిపారు. ఓట్ల తొలగింపుపై వారికి సమాచారం ఇవ్వాల్సి ఉందని కోరామని, ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓటు వేర్వేరు పోలింగ్‌ బూతుల్లో ఉండటంపై కూడా మార్పులు చేయలని కోరామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన వాటిపై ఉదాహరణలతో సహా వివరించామని తెలిపారు. వీవీ ప్యాట్లు విషయంలో 10 శాతం ఓట్లయినా ఈవీఎం మెషీన్లలో ట్యాలీ అవ్వాలని చెప్పామన్నారు. అంబులెన్స్‌ల్లో, తెలంగాణలోని పోలీస్‌ వాహనాల్లో డబ్బు పంపారనే ఆరోపణలున్నాయని, వాటిపై కఠిన చర్యలు ఉండాలని కోరినట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
సిపిఐ నేత-మాజీ ఎమ్మెల్సీ విల్సన్‌ మాట్లాడుతూ.. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను కేంద్రం తమ గుప్పిట్లో
పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తోందన్నారు. ఎన్నికల సంఘం అలా ఉండకూడదని కోరామన్నారు. పోలింగ్‌ నిర్వహించే రోజున 16 గుర్తింపు కార్డులకు అనుమతి ఇస్తారు. కాబట్టి అవి సరిగా అమలు జరిగేలా చూడాలని కోరామన్నారు. ప్రభుత్వ డబ్బులతోనే ఓట్లు కొనే పద్ధతి మొదలయ్యిందని, దీన్ని అరికట్టాలని చెప్పామన్నారు. ఆన్‌లైన్‌ విధానమే కాకుండా మాన్యువల్‌ గా ఓటర్ల నమోదు జరిగేలా చూడాలని కోరామన్నారు. గిరిజనులు, దూర ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక భద్రత ఏర్పాట్ల మధ్య ఓట్లు వేసేలా చూడాలని కోరామన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే పెన్షన్లు పెంచటం, బ్యాంకుల ద్వారా చెక్కులు పంపిణీ చేయటం జరిగిందని చెప్పారు. పోలింగ్‌ జరిగే లోపుగా బ్యాంకులు పార్టీ కార్యకర్తలుగా మారి డబ్బులు పంపిణీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేత సుందర రామ శర్మ మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేస్తోంటే కట్టడి చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. మేనిఫెస్టోలోకి అంశంపై ఒక నియంత్రణ ఉండాలని కోరారు. ఓట్లర్ల లిస్టులో ఓట్లు గల్లంతుపై తెలంగాణలో మాదిరి పొరపాట్లు జరగకుండా ఈసీ చూడాలని కోరామన్నారు. బిజెపి రాష్ట్ర లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ రంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలను రోడ్ల విూద తిరగనివ్వబోమని సిఎం చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి  తీసుకెళ్ళామన్నారు. కన్నా, సోము వీర్రాజు ఇళ్లపై దాడిపై ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదు చేయలేదని చెప్పామన్నారు. డిజిపికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు నెలల్లో నాలుగు సార్లు డిజిపిని కలిసి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని తెలిపామన్నారు. డ్వాక్రా గ్రూపులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇవ్వడంపై అభ్యంతరాలు తెలిపామన్నారు. ఎన్నికల సమయంలో ఏ విధంగా చెక్కులు ఇస్తారని, అనుమతి తీసుకోవాలనే దానిపై ఈసీకి చెప్పామన్నారు. ఓటర్లను మభ్యపెట్టే పని కాబట్టి ఈ చెక్కులను ఎన్నికల సమయంలో హౌల్డ్‌ లో పెట్టాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఈ చెక్కులపై సమగ్ర విచారణ కోరామన్నారు. 2019 జనవరి నాటికి రూ.18.66 లక్షలు యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సి ఉండగా, కేవలం 5 లక్షల మంది యువత మాత్రమే నమోదు చేసుకున్నారని చెప్పారు. కళాశాలల్లో ఓట్ల నమోదుపై క్యాంపెన్‌ చేయాలని ఈసీని కోరామని చెప్పారు. టిడిపి నేత పట్టాభిరాం మాట్లాడుతూ.. వీవీ ప్యాట్‌ కౌంటింగ్‌ జరపాలని ఈసీని కోరామన్నారు. ఈవీఎంల విూద ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని, బ్యాలెట్‌ పద్ధతిని కోరినట్లు చెప్పారు. వీవీ ప్యాట్ల కౌంటింగ్‌ చేయాలని కోరామని చెప్పారు. వైసిపి నేతలు డ్యూటీలో ఉన్న అధికారులను బెదిరిస్తున్నారని, దీనిపై ఈసీకి చెప్పామని అన్నారు. వైసిపి నేతలను కట్టడి చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు. వైసిపి నేత పార్థసారథి మాట్లాడుతూ.. ఎన్నికల పక్రియను టిడిపి ఫార్స్‌ గా మారుస్తోందన్నారు. గెలుపు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 39 లక్షల దొంగ ఓట్లు ఎపి లో నమోదయ్యాయన్నారు. సర్వే పేరుతో ట్యాబ్‌ లను ఇచ్చిన టిడిపి, అందులో ఒక యాప్‌ ద్వారా ఓటర్ల లిస్టు మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుని వారి వివరాలు ఓటర్ల లిస్టుకి పంపుతున్నారన్నారు. టిడిపి నేతలు బిఎల్‌ఒ ల విూద ఒత్తిడి తెచ్చి ఓటర్లను తొలగిస్తున్నారని చెప్పారు. అధికారుల బదిలీలను కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో.. బిజెపి నేతలు జె.రంగరాజు, సిపిఐ నేత జెల్లి విల్సన్‌, సిపిఎం నేత వై.వెంకటేశ్వర రావు, కాంగ్రెస్‌ నుంచి తాంతియా కుమారి, టిడిపి నేత పట్టాభి రాం, వైసిపి నేత పార్థసారథి లు ఉన్నారు.