ఎయిమ్స్‌లో చేరిన బీహార్‌ సీఎం

– జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నితీశ్‌కుమార్‌
– వైద్య సేవలు అందిస్తున్న వెల్లడించిన వైద్యులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మంగళవరాం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఆసుపత్రి వైద్యలు తెలిపారు. ఆయన కొన్ని రోజుల నుంచి కంటి సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. ఈనెల మొదటి వారంలోనూ ఆయన జ్వరంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన సుమారు వారం రోజుల పాటు ఎలాంటి సమావేశాల్లో పాల్గొనలేదు. అలాగే అన్ని అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసుకున్నారు. కాగా, నితీశ్‌ కుమార్‌ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకుని భాజపా అధిష్ఠానాన్ని కలిసే అవకాశం ఉందని  వార్తలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామిగా పోటీ చేయాలనుకుంటున్న జేడీయూకి భాజపా మొదట 12 సీట్లు కేటాయించినట్లు సమాచారం. దీనిపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేయగా రెండు రోజుల క్రితం భాజపా తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం నితీశ్‌ కుమార్‌ విూడియాతో మాట్లాడుతూ… ‘లోక్‌సభ సీట్ల పంపకాలపై భాజపాతో సంతృప్తికరంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. దీనిపై త్వరలోనే అధికారంగా అన్ని వివరాలు వెల్లడిస్తాం అని ప్రకటించారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన అనంతరం నితీశ్‌ కుమార్‌ ఈ విషయంపై తుది చర్చలు జరిపే అవకాశం ఉంది. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ సీట్లు ఉన్నాయి.