ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం


` ఆ సామర్థ్యం భారత్‌కు ఉంది
` సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి
దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని అన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 146వ జయంతి సందర్భంగా వర్చువల్‌ పద్ధతిలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. భూమి, జలం, గగనతలాల్లో భారత్‌ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు. సర్దార్‌ పటేల్‌ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.‘భారత్‌ ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో, వినయంగా ఉంటూ అందరినీ కలుపుకునేతత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్‌ పటేల్‌ ఎల్లప్పుడూ కోరుకునేవారు. ఆ క్రమంలో జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా భారత్‌ మారుతోందన్నారు. ఎన్నో దశాబ్దాల నాటి అనవసరపు పురాతన చట్టాల నుంచి గడిచిన ఏడేళ్లలోనే భారత్‌ విముక్తి పొందిందని అన్నారు. ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌’ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్‌ పటేల్‌కు యావత్‌ దేశం నివాళులు అర్పిస్తోందన్నారు. కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్‌ పటేల్‌ సజీవంగా ఉన్నారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
రాబోయే తరాలకు స్ఫూర్తి: అమిత్‌ షా
దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంతోపాటు దేశ ఐక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరనే సందేశాన్ని యావత్‌ ప్రపంచానికి ఐక్యతా విగ్రహం (ూబిజీబిబీవ నీట ఙనితిబివ) అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాబోయే తరాలను సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పారు. పటేల్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌ జిల్లాలోని కెవడియాలో ఉన్న సర్దార్‌ పటేల్‌ భారీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌ షా ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత భారత్‌ను ఏకం చేయడానికి సర్దార్‌ పటేల్‌ చేసిన కృషిని అమిత్‌ షా గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన కృషి వల్లే లక్షద్వీప్‌ దేశంలో అంతర్భాగం అయ్యిందన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విమర్శించిన ఆయన.. భారత ఉక్కు మనిషి జ్ఞాపకాలను మరచిపోయేలా ప్రయత్నాలు జరిగాయని దుయ్యబట్టారు.