ఎస్‌బిఐ భారీ ఆఫర్లు
పండగవేళ గృహరుణాల తగ్గింపు
హైదరాబాద్,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : పండగ సీజన్ వేళ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ప్రకటన చేసింది. గృహరుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రుణరేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ ఎస్‌బీఐ ప్రకటన చేసింది. కాలపరిమితి ముగిసిన అన్ని టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రెపో రేట్లు తగ్గించిన కొన్ని వారాల్లోనే ఎస్‌బీఐ మరో భారీ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించడం ఇది అయిదవసారి. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. 45 రోజుల్లో మెచూరిటీ పొందే ఎఫ్‌డీలపై వడ్డీ రేటు మాత్రం 4.5 శాతమే ఉంటుంది. కానీ 180 నుంచి ఏడాది వరకు చేసిన ఎఫ్‌డీలపై 5.8 శాతం ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది. మూడేళ్ల వరకు ఎఫ్‌డీలపై 6.35 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఓబీసీ, ఐడీబీఐ, ఐడీఎఫ్సీ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ చార్జీలను ఎత్తివేశాయి.