ఏనుగుల గుంపు భీభత్పం, ముగ్గురు మృతి

ఒడిశాలో  ఏనుగుల దాడి నిత్యాకృత్యంగా మారింది. తాల్చేర్‌ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో వరండాలో నిద్రపోతున్న ఓ కుటుంబంపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మరణించారు. అంగుల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వీరిలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అనంతరం మరో ఇంటిపై దాడిచేయడంతో అక్కడ ఓ మహిళ మృతి చెందింది.  తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ ఏనుగు దీనికి కొద్ది కిలోమీటర్ల దూరంలోని సంత్‌ పద అనే గ్రామంలో మరో ఇంటిపై దాడికి పాల్పడింది. అక్కడ ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.

ఏనుగుల దాడిలో మనుషులు మృత్యువాత పడిన సంఘటనలు ఒడిశాలో తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా వన్యప్రాణి సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత తొమ్మిదేళ్లలో 694 ఏనుగులు అంతరించగా, ఏనుగులు దాడిలో 661 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2018-19 ఏడాదిలో అత్యధికంగా 92 మంది మృతిచెందగా, 91 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇప్పటి వరకు మూడు ఏనుగులు చనిపోగా, ఇవి జరిపిన దాడిలో పది మంది చనిపోయారు. గతేడాది ఏనుగులు దాడులతో 92 మంది చనిపోయారని, ఇప్పటి వరకూ ఇదే అత్యధికమని ఒడిశా వన్యప్రాణి సోసైటీ తెలిపింది.

ఆ ఏనుగు జనావాసాలపై దాడిచేయడానికి కారణం మతిభ్రమించడమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళలో సరైన రక్షణ తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఏనుగులు దాడిచేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.