ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు

– ఏపీకిచ్చిన హావిూలు, నెరవేర్చిన వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగింది

– లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధప్రదేశ్‌కు ఇచ్చిన హావిూల ఊసే లేదని, బడ్జెట్‌లో రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ ధ్వజమెత్తారు. ఏపీకిచ్చిన హావిూలు, నెరవేర్చిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిందని జయదేవ్‌ అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కచ్చితత్వం, జవాబుదారీతనం లోపించిందని ఎద్దేవాచేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని 29 అంశాల్లో ఏపీకి న్యాయం జరగలేదన్నారు. ఢిల్లీని మించి రాజధాని కడతామని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోదీ చెప్పారని, తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హావిూలను విస్మరించారని విమర్శించారు. రైతులను ఆదుకుంటామంటూ చెప్పి రోజుకు రూ.17 ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని గల్లా విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ఏపీలో సీఎం చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు చేశారన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. జీఎస్టీ, నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలను పోగొట్టారని అన్నారు. ఐదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చివరి బడ్జెట్‌లో ఏవో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ ఉన్నవి ఊడగొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీని మించిన రాజధాని కడతామని చెప్పి.. పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబును తక్కువ అంచనా వేస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని గెల్లా హెచ్చరించారు.