ఏపీ బాటలో కర్ణాటక

– పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గింపు

– ప్రకటించిన కర్ణాటక సీఎం కుమారస్వామి

– తక్షణమే అమల్లోకి తగ్గింపు ధరలు

బెంగళూరు, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవ కేంద్రం తీరును నిరసిస్తూ, పెట్రో, డీజిల్‌ ధరల పెంపుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. అయినా పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు అలా ఉంచితే రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఏపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రూ. 2తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో తాజాగా కర్ణాటక చేరింది. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రోజురోజుకీ ఇంధన ధరలు పెరుగుతున్నా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం తానే రంగంలోకి దిగింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2లు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పన్నును తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పన్నులు పెంచుతున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. కొద్దిరోజులుగా చమురు సంస్థలు ఇంధన ధరలను భారీగా పెంచుతుండటంతో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌ లీటరుకు రూ.84.40లు, డీజిల్‌ రూ.75.80లు వసూలు చేస్తున్నారు.

వీటిపై ప్రభుత్వం విధించే పన్ను పెంచినా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంధన ధరలు తక్కువని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. కానీ పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా నింగిని తాకుతున్నట్లు భావించిన ప్రభుత్వం వీటిపై విధించే సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు రూ.2లు తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.