ఓట్ ఆన్ అకౌంట్‌కే.. పరిమితం కావాల్సిన పనిలేదు
– అవసరమైనప్పుడు సాంప్రదాయాలకు భిన్నంగా వెళ్లొచ్చు
– దేశ ప్రజానీకానికి ఏం అవసరమో అదే బడ్జెట్‌లో ఉంటుంది
– కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ
వాసింగ్టన్, జనవరి 18(జనంసాక్షి) : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్‌గా మాత్రమే ఉండాల్సిన పనిలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అంతకు మించి ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ.. ఓ విూడియా సంస్థ నిర్వహించిన అవార్డుల ఫంక్షన్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెడుతుందని, అయితే ఇపుడు దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ముఖ్యంగా వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉందని జైట్లీ అన్నారు. ఇటువంటి పరిస్థితుతల్లో ప్రభుత్వం కేవలం ఓట్ ఆన్ అకౌంట్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు బడ్జెట్‌లో పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. సాధారణంగా ఎన్నిల ఏడాది తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ఉంటున్నా…ఆ తాత్కాలిక బడ్జెట్‌లో ఏమి ఉండాలనేది దేశ విస్తృత ప్రయోజనాలను బట్టి ఉంటుందని అరుణ్‌జైట్లీ అన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అదేసమయంలో వచ్చే 3-4 నెలలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల ప్రజలను మెప్పించి, ఆకర్షించగలగాలి. మరీముఖ్యంగా ఇటీవల కాలంలో రైతుల ఆందోళనలు పెరిగాయి. వారు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కేంద్రం రైతులకు తోడ్పాటు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందువల్ల మధ్యంతర బడ్జెట్‌లో వీరికి తాయిలాలు ప్రకటించే అవకాశముంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఒక ప్యాకేజీని అందించొచ్చనే సంకేతాలిచ్చారు. ఫిబ్రవరి 1 నాటి మధ్యంతర బడ్జెట్లో దీనికి సంబంధించి ప్రకటన ఉండే అవకాశముంది. ఈ బడ్జెట్ ద్వారా మోదీ సర్కారుపై దేశవ్యాప్తంగా రైతుల్లో వ్యతిరేకతను తొలగించేందుకు వ్యవసాయ ప్యాకేజ్ ప్రాధాన్యత సంతరించుకోనే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జనవరి 17న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధ మోహన్ సింగ్ కూడా రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు ఉండొచ్చని సంకేతానిచ్చారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో కీలక ప్రకటనలు వెలువడొచ్చని ఆయన తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పంట రుణాలు సక్రమంగా చెల్లించే రైతులకు వడ్డీ మినహాయింపు, ఆర్థిక ప్యాకేజ్ వంటి అంశాలను ప్రతిపాదించారు.