కమ్యూనిస్టులతో పవన్‌కు చెడిందా?
– అన్ని ప్రాంతాల్లో సొంతంగా పోటీ చేస్తామని పవన్ ప్రకటన
– కమ్యునిస్టులతో పొత్తుపై రాని స్పష్టత
– ఎర్రదండులో చర్చనీయాంశంగా మారిన పవన్ వ్యాఖ్యలు
అమరావతి, మే3(జనం సాక్షి) : కమ్యూనిస్టులతో పవన్‌కు చెడిందా..? కేవలం ఉద్యమాల్లోనే కమ్యూనిస్టులతో కలిసి సాగుతారా..? పొత్తులపై జనసేన ఆసక్తి చూపడం లేదా..? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సొంతంగా పోటీ చేస్తుందని ప్రకటించడం ఆసక్తిదాయకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ ఇది వరకూ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా, పవన్ తాజాగా మాట్లాడుతూ అన్ని స్థానాల్లోనూ పోటీ అని ప్రకటించారు. కొన్నాళ్ల కిందట పవన్ మాట్లాడుతూ తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అన్ని చోట్లా పోటీ చేస్తున్నట్టుగా పవన్ ప్రకటించారు. ఇది జనసేన అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కమ్యూనిస్టు పార్టీలతో పవన్ స్నేహం కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాకా పవన్ కల్యాణ్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతోనూ చేతులు కలిపారు. జనసేన, కమ్యూనిస్టు పార్టీల కాంబోలో పలు సమావేశాలు కూడా జరిగాయి. అలాగే ఆ మధ్య పవన్ నిర్వహించిన చిన్నపాటి పాదయాత్రలో కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. అలాగే పవన్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలో కూడా కమ్యూనిస్టు పార్టీల వాళ్లు భాగస్వామ్యులయ్యారు.
ఇలా జనసేన, ఎర్రపార్టీల మధ్యన బంధం కొనసాగింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలతో ఒక కూటమిని ఏర్పాటు చేస్తామన్నట్టుగా కూడా కమ్యూనిస్టు పార్టీల నేతలు ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ల మాటలు అలా ఉంటే, రెండు రోజుల క్రితం పవన్ మాత్రం అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ అన్ని స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తుందని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్టులతో పొత్తు అంశం గురించి కానీ, వారితో సీట్ల ఒప్పందం గురించి కానీ పవన్ మాట్లాడలేదు. అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు. ఇది ఎర్రదండులో చర్చనీయాంశంగా మారింది. వాళ్లేమో పవన్ తో కూటమి ఆశల్లో ఉంటే, పవన్ మాత్రం ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో జనసేన, కమ్యూనిస్టు పార్టీల బంధం ఉన్నట్టా? తెగినట్టా? అనే సందేహాలకు బీజం పడుతుంది.