కరుణానిధి ఆశయసాధనకోసం..

ప్రతీ కార్యకర్త కృషి చేయాలి
– మెరీనా బీచ్‌లో సమాధి ఏర్పాటు చేయాలన్నది కరుణ చివరి కోరిక
– పళనిస్వామి చేతులు పట్టి వేడుకున్నా.. అయినా కణికరించలేదు
– డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌
చెన్నై, ఆగస్టు14(జ‌నం సాక్షి): కరుణానిధి వంటి దిగ్గజ నేతను డీఎంకే కోల్పోతే తాను తండ్రిని కూడా కోల్పోయానని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ అన్నారు. మంగళవారం జరిగిన డీఎంకే ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడారు. కరుణానిధి ఆశయాల సాధన కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని అన్నారు. మెరీనా బీచ్‌లో తన సమాధి ఏర్పాటు చేయాలన్న కరుణానిధి చివరి కోరికను ముఖ్యమంత్రి పళనిస్వామి తోసిపుచ్చడంతో తలెత్తిన వివాదంపై స్టాలిన్‌ ఘాటుగా స్పందించారు. ‘కలైంజ్ఞర్‌ ఆఖరి ఘడియల్లో నేను ముఖ్యమంత్రి చేతులు పట్టుకుని మెరీనా బీచ్‌లో తనను సమాధి చేయాలన్న కరుణానిధి చివరి కోరికను ఆయన దృష్టికి తెచ్చాను. అంగీకరించాలని వేడుకున్నాను. అయితే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నా అభ్యర్థనను తోసిపుచ్చిందని మండిపడ్డారు. మెరినా బీచ్‌లోనే కరుణానిధి అంత్యక్రియలకు కోర్టు గ్రీన్‌సిగ్నిల్‌ ఇవ్వడం వెనుక పూర్తి క్రెడిట్‌ లాయర్లకే దక్కుతుందన్నారు. అదే జరిగి ఉండకపోతే మా నేతతో పాటు నేను కూడా సమాధి అయి ఉండేవాడినే అంటూ స్టాలిన్‌ భావోద్వేగానికి గురయ్యారు. కరుణానిధి ఆశయాల సాధన కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని స్టాలిన్‌ సూచించారు.