కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌..!

– పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేసిన ఉమేశ్‌ జాధవ్‌
– 6న ప్రధాని సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం
బెంగళూరు, మార్చి4(జ‌నంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాధవ్‌ సోమవారం పార్టీ స్వభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ.. స్పీకర్‌కు లేఖ సమర్పించారు. చించోలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌కు కలబురిగి నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ ఇవ్వనుందని సమాచారం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న కర్ణాటక పర్యటనకు వస్తున్నారని.. ఆ సందర్భంగా ఉమేష్‌ బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ నెల 1వ తేదీన బీజేపీ నాయకుడు బాబురావు మాట్లాడుతూ.. మల్లికార్జున్‌ ఖర్గేకు జాదవ్‌ మద్దతివ్వరని తెలిపారు. అధికారం కోసం బీజేపీలోకి జాదవ్‌ రావడం లేదని షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి కోసం వస్తున్నారని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉమేష్‌ జాదవ్‌.. కాలాబురాగి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. చించోలి నియోజకవర్గం నుంచి జాదవ్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వృత్తిరీత్యా డాక్టరైన జాదవ్‌.. రాజకీయ రంగ ప్రవేశం కంటే ముందు కాలాబురాగి ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికార మిత్రపక్షమైన జేడీఎస్‌తో తీవ్ర విభేదాలు ఎదుర్కొంటోంది. మరోవైపు కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేసిందని ఆ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా తాను దళితుడు కావడం వల్ల తనకు మూడుసార్లు సీఎం పదవి నిరాకరించారని, తాను ఉప ముఖ్యమంత్రి పదవిని అసంతృప్తితోనే నిర్వహిస్తున్నానని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ జీ పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీని కుదిపేస్తున్నాయి.