కర్ణాటకలో హస్తం హవా

– బీజేపీకి షాక్‌ ఇచ్చిన పట్టణ ప్రజలు
బెంగళూరు, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగర ప్రాంతాల్లో వెల్లడైన ఫలితాలతో కంగుతినడం బీజేపీ వంతైంది. సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రకటించిన ఫలితాల్లో 913 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. 330 చోట్ల జేడీఎస్‌ అభ్యర్థులు జయ కేతనం ఎగురవేశారు. 855 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. షిమోగా, మైసూర్‌, తుముకూరులో మాత్రమే బీజేపీ ఆధిపత్యం కనబర్చిం. కొస్టల్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. ఉత్తర కర్ణాటకలో స్వతంత్రుల హవా నడిచింది. స్థానిక ఫలితాలు నిరాశపరిచాయని బీజేపీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఇక ఫలితాలతో జోష్‌ విూదున్న కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కార్యకర్తలు సంబరాలకు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ పొత్తుకు జనామోదం ఉందని రుజువైందని దేవెగౌడ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో తేల్చుకుందామని బీజేపీ నేతలు తమ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. 102 స్థానిక సంస్థల్లో ఆగస్టు 31న పోలింగ్‌ జరిగింది. 102 స్థానిక సంస్థల్లో మొత్తం 2,664 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
2019లో ఇలా జరగదు – యడ్యూరప్ప
ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత యడ్యూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం వల్ల భాజపా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందని, అయితే 2019లో ఇలా జరగబోదని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.
కాంగ్రెస్‌ ర్యాలీపై యాసిడ్‌ దాడి.. 30మందికి గాయాలు..
కర్ణాటకలోని తుంకూరులో కాంగ్రెస్‌ ర్యాలీపై సోమవారం యాసిడ్‌ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 30 మంది కార్యకర్తలు గాయపడ్డారు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాల్లో మునిగి ఉండగా ఈ దాడి చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం తుంకూరు సిటీ కార్పొరేషన్‌ 16వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించగానే కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. ఇదే తరుణంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై యాసిడ్‌ దాడికి తెగబడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, యాసిడ్‌ దాడిలో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉండొచ్చని కాంగ్రెస్‌ అనుమానిస్తోంది. తమ విజయాన్ని చూసి ఓర్వలేకనే బీజేపీ ఈ దాడులకు పాల్పడిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ నేత కేఈ రాధాకృష్ణన్‌ అన్నారు. తుంకూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మూడు స్థానాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.