కల్తీమద్యం ఘటనలో 66కు చేరిన మృతుల సంఖ్య

విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
గౌహతి,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  అసోంలో విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 66కు చేరుకుంది.ఈ ఘటనలో ఒక్క గోలాఘాట్‌లోనే 39 మరణాలు సంభవించాయి. వేడుకలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఈ కలుషిత మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి పరిమళ్‌ శుక్లాబైడ్యా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో అలసత్వం వహించినందుకు గానూ ఇద్దరు ఎక్సైజ్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మద్యాన్ని రసాయనాల క్యాన్‌లో తీసుకురావడం వల్లే అది విషపూరితమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉన్న జూగీబారీ ప్రాంతంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఇందుకల్పా బోర్డాలోయ్‌, దేబాబోరాలను పోలీసులు అరెస్టు చేశారు.ఇటీవల ఉత్తరాఖండ్‌ ఘటనతరవాత ఇది మరింత పెద్ద ప్రమాదంగా గుర్తించారు. అక్కడా కల్తీ మద్యానికి పలువురు బలయ్యారు. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే సంజు ఒరాంగ్‌ అనే వ్యక్తి నుంచి మద్యం తీసుకొచ్చారు. మద్యం సేవించిన కాసేపటికే నలుగురు మహిళలు కుప్పకూలారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటికి ఈ ఘటన మృతుల సంఖ్య 66కు చేరుకుంది. ఈ ఘటనలో మద్యం అమ్మిన వ్యక్తి సంజు ఒరాంగ్‌, అతడి తల్లికూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తేయాకు తోటల్లో పనిచేసే వారికి వారానికోసారి కూలీలు ఇస్తుంటారు. ఈ క్రమంలో వారికి గురువారం కూలీ డబ్బులు అందాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కూలీలు అక్కడకు చేరుకుని వేడుకలు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కోగ్లాసు మద్యం రూ.10, రూ.20లకు దుకాణ యజమాని సంజు అమ్మాడని దీంతో కొందరు స్థాయికి మించి మద్యం సేవించారని స్థానికులు పేర్కొన్నారు.