కవితకు బెయిల్‌పై బండి విపరీత వ్యాఖ్యలు


కోర్టు ధిక్రణగా పరిగణించాలన్న కెటిఆర్‌
హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి): ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్‌ చేసిన బండి సంజయ్‌ తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలా విజయమంటూ బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ లాయర్‌ చేసిన కృషితో ఒకరికి బెయిల్‌ వస్తే బీఆర్‌ఎస్‌ సపోర్ట్‌ కారణంగా ఒకరు రాజ్యసభలో స్థానం పొందారంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ కోసం తొలుత వాదనలు వినిపించిన లాయర్‌కు కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ సీటు వచ్చేలా కేసీఆర్‌ రాజకీయ చతురత ప్రదర్శించారంటూ ఆయన చేసిన ట్వీట్‌ చేశారు. వైన్‌ అండ్‌ డైన్‌ కైమ్ర్‌ లో పార్టనర్స్‌ అయిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు కంగ్రాట్యులేషన్స్‌ అంటూ స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంజయ్‌ కామెంట్స్‌ చేశారు. దీనిపై కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రిగా ఉన్న బండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని తెలిపారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలా స్పందించడమేంటని నిలదీశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా తీసుకుని బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
చేశారు.