కశ్మీరులపై దాడులు జరగకుండా.. చర్యలు తీసుకోండి

– కేంద్రం సహా 11రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి) : పుల్వామా ఘటన తర్వాత దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, వారిని బహిష్కరించాలని పలు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ ను విచారించిన సుప్రీంకోర్టు… కేంద్ర ప్రభుత్వం సహా 11రాష్ట్రాలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కశ్మీరీలతో పాటు ఇతర మైనార్టీలపై జరిగిన దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సహా ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌ కు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తారిక్‌ అదీబ్‌ అనే పిటిషనర్‌ తరపున సుప్రీం సీనియర్‌ న్యాయవాది ఈ పిటిషన్‌ వేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో, పిటిషన్‌ ను వెంటనే విచారించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ ను విచారించింది. పుల్వామా ఘటన తర్వాత దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ దాడులకు అడ్డుకట్ట వేసే విధంగా అధికారులను ఆదేశించాలని పిటిషన్‌ లో కోరారు. విూడియాలో వచ్చిన డజన్ల కొద్దీ రిపోర్టులను పిటిషన్‌ కు జత చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. కశ్మీరీలను, వారి వస్తువులను బహిష్కరించాలంటూ మేఘాలయ గవర్నర్‌ తథాగథరాయ్‌ చేసిన వ్యాఖ్యలను కూడా తన పిటీషన్లో నమోదు చేశారు. దీనిపై స్పందించిన కశ్మీరీలపై వేధింపులు, దాడులకు పాల్పడే వారిపై తగిన, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. మూకదాడుల నియంత్రణ కోసం గతంలో నియమించిన నోడల్‌ అధికారులు ఈ దాడులు జరగకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఈ నోడల్‌ అధికారుల గురించి కేంద్ర ¬ంశాఖ విస్తృత ప్రచారం చేయాలని, అప్పుడు వేధింపులకు గురవుతున్న కశ్మీరీలు వారిని సంప్రదిస్తారని న్యాయస్థానం పేర్కొంది.