కాంగ్రెస్‌కు పొన్నాల గుడ్‌బై..

` ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా..
` ఇకపై నేను భరించలేను..అందుకే ఈ నిర్ణయం: లక్ష్మయ్య
` ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ
హైదరాబాద్‌(జనంసాక్షి):  పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనగామ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన, రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వైఎస్‌ కేబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణకు తొలి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌ జిల్లాలోని జనగాం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పాడు. 15 ఫిబ్రవరి 1944లో వరంగల్‌ జిల్లాలో జన్మించిన పొన్నాల 1980 నుంచి కాంగ్రెస్‌లో పని చేస్తున్నారు. రాజీనామాతో జనగామ అభ్యర్థిగా పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్‌ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని అభ్యర్థి అని చెప్పినా అధికారికంగా బీఆర్‌ఎస్‌ ప్రకటించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థానంలో పొన్నాలను బరిలోకి దించుతారన్న ప్రచారం జరుగుతోంది. బీసీ కార్డును ప్రయోగిస్తే లాభం చేకూరుతుందని బీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయన్న ఆయన, తన లాంటి సీనియర్‌ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్‌మెంట్‌ కోసం వేచి చూడడం దురదృష్టకర పరిణామమని వెల్లడిరచారు. ఢల్లీికి వచ్చిన 10 రోజులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుద్దామని ప్రయత్నిస్తే, ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదన్నారు. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో కీలకమైన ఇంజనీర్‌గా పనిచేస్తున్న సమయంలో, అప్పటి జాతీయ నాయకులు పీవీ నరసింహారావు పిలుపుతో కాంగ్రెస్‌లో చేరానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చేరానని, నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షుడి వరకు  కీలక పదవులను చేపట్టినట్లు చెప్పారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేసినట్లు లేఖలో ప్రస్తావించారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తీవ్రంగా కలిసివేశాయని, 2015లో పిసిసి అధ్యక్ష పదవి నుంచి  అకారణంగా తొలగించినా, దాదాపు 9 ఏళ్లు ఏలాంటి పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేశానన్నారు. 2014లో దేశవ్యాప్తంగా పార్టీ ఓటమిపాలయితే, తెలంగాణ ఓటమికి తనను బలి చేశారన్న పొన్నాల, అదే 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపడకపోయినా ఆనాటి నాయకత్వంపై చర్యలు తీసుకోలేదని, పైగా పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తాను పార్టీ సిద్ధాంతాల ప్రకారం బడుగు బలహీన వర్గాలు అంశాలను ఎత్తిచూపడం, పార్టీ బలోపేతానికి తన వంతుగా అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నానని చెప్పారు. ఎంత మంది ఎన్ని రకాలుగా తనపై మాట్లాడిన పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని స్పష్టం చేశారు.   గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు పొన్నాల దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే సమయంలో పొన్నాల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి టికెట్‌ కేటాయిస్తారని ప్రచారం జరగడంతో పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొన్నాల రాజీనామాతో జనగామ కాంగ్రెస్‌ పై తీవ్ర ప్రభావం పడనుంది. పొన్నాలతో పాటే ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. తన క్యాడర్‌తో చర్చించాకే పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుడిగా పొన్నాల లక్ష్మయ్య బలమైన ముద్ర వేశారు. పొన్నాలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేలా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పథకం రచిస్తున్నారు.  పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరితే జనగామ, తెలంగాణ రాజకీయాలు అనూహ్య మార్పుకు నాంది కాబోతున్నాయి.  పొన్నాల బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరితే.. పొన్నాలకు ఉన్న ఓటు బ్యాంకు బీఆర్‌ఎస్‌ వైపు మళ్లి కాంగ్రెస్‌ పార్టీకి నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది. జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు సులువు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ని నిలబెట్టకుండా పొన్నాలనే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. జనగామ నియోజకవర్గంలో బీసీ కమ్యూనిటీ అధికంగా ఉంటుందని ఇందులో భాగంగానే పొన్నాలను బీఆర్‌ఎస్‌ తరపున అసెంబ్లీ బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని మరో ప్రచారం జరుగుతోంది.
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. అందుకే ఈ నిర్ణయం
కాంగ్రెస్‌ పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. చివరకు అవి భరించలేకే ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.శుక్రవారం ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్టు లేఖ విడుదల చేసిన అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కాంగ్రెస్‌ను వీడటానికి దారితీసిన కొన్ని కారణాలను వివరించే క్రమంలో పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. ‘’45ఏళ్లలో నాలుగుసార్లు గెలిస్తే.. అందులో మూడు సార్లు వరుసగా గెలిచిన బీసీ అభ్యర్థి ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. 12 ఏళ్ల పైచీలుకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అయినా నాకు పార్టీలో అవమానాలు, అవహేళనలు. కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరుల్ని కించపరిచే విధానం చూసి నాకు విసుగెత్తింది. 45 ఏళ్ల తర్వాత ఇంకా నేను తట్టుకోలేకపోయాను’’ అని అన్నారు.’’1983 నుంచి 2023వరకు మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1989లో చెన్నారెడ్డి సారథ్యంలో, 2004, 2009లో వైఎస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పాటుచేసినా.. తెలంగాణ ప్రాంతంలో 50శాతం సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఎంత చెప్పినా వినే నాథుడే లేడు. ఈరోజు 50శాతం సీట్లు రావాలంటే ప్రజా మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించిందని ఆలోచించడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు. చెబితే వినేవాళ్లు లేరు. కలవడానికి అంతకన్నా లేరు. అనుభవవాలు ఊరికే పోతాయా? నా లేఖలో అన్ని విషయాలూ చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకా అదనంగా ఏవిూ మాట్లాడేదిలేదు’’ అని పొన్నాల తెలిపారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు స్పందించిన పొన్నాల.. పదవుల కోసం తాను రాజీనామా చేయలేదన్నారు. భవిష్యత్తు గురించి ఎవరెవరు ఏదో ఊహించుకున్నా దానిపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. జనగామలో పోటీ, తన రాజకీయ భవిష్యత్తుపై ఏం మాట్లాడదలచుకోలేదని అన్నారు.