కాంగ్రెస్‌తో జతకట్టిన టీజేఎస్
` కేసీఆర్‌ను గద్దెదించేందుకు కలిసి పనిచేస్తాం:రేవంత్‌రెడ్డి, కోదండరాం
` వచ్చే కాంగ్రెస్ సర్కారులో టీజేఎస్‌కు కీలక స్థానం
` సీట్లు,ఓట్ల కంటే గొప్ప లక్ష్యంకోసం ఏకమయ్యాం:రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):శాసనసభ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికల వ్యవధి సరిగా నెల రోజులు ఉండేసరికి..చేరికలను ఆహ్వానిస్తూ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు ఎక్కువనే చెప్పవచ్చు. నిన్నటి వరకు వామపక్షాలతో.. తాజాగా టీజేఎస్ పార్టీతో పొత్తులు పర్వాన్ని సాగిస్తోంది. అందినకాడికి సమన్వయం చేసుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఎన్నికల బరిలో అభ్యర్థుల ప్రకటనలో ఒక మెట్టు తక్కువగా ఉన్న కాంగ్రెస్.. అభ్యర్థుల చేరికలు, పార్టీ పొత్తుల విషయంలో మాత్రం దూకుడుగా ఉందనే చెప్పవచ్చు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతూ.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అన్ని పార్టీల మద్దతు కూడబెడుతు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నాంప్లలిలోని టీజేఎస్ కార్యాలయంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు తెలపాలని కోదండరాంను రేవంత్‌రెడ్డి కోరారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇరువురు చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు ఇరుపార్టీలు అంగీకరానికి వచ్చాయి. త్వరలోనే ఇరు పార్టీలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తాయి. ఈ భేటీ సీట్లు, ఓట్ల కంటే గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తాయి. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కలిసి నడుస్తామని అదేవిధంగా ప్రజాస్వామ్యంలో పార్టీలు పది మందితో కలసి పనిచేస్తాయన్నారు. ప్రజల సహకారంతో పార్టీలు ముందుకు వెళ్తాయని వివరించారు. ఈ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కోదండరామ్ కీలకపాత్ర పోషిస్తారని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈమేరకు ఇంతకు ముందే రాహుల్ గాంధీతో ).. కోదండరాం సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఆయన అంగీకరించారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలంగాణ జన సమితి ఇదివరకే ప్రకటించింది. కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు ఆచార్య కోదండరామ్ వెల్లడిరచారు. అనంతరం కేసీఆర్ నిరంకుశ పాలన అంతం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. ప్రజాపరిపాలన కోసం తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. నవ తెలంగాణ నిర్మాణ ప్రాతిపదికన మద్దతు తెలిపామన్న కోదండరాం.. టీజేఎస్ తరఫున ఆరు అంశాలను కాంగ్రెస్ పార్టీ ముందుపెట్టినట్లు తెలిపారు. వాటిలో ప్రధానంగా నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించాలని కోరినట్లు వెల్లడిరచారు. కుటీర పరిశ్రమల ఎదుగుదలకు కృషిచేయాలని.. సాంప్రదాయ వృత్తులు , రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని కోదండరామ్ కోరారు. రైతుల భూములకు రక్షణ, ప్రజాస్వామ్య పాలన నెలకొల్పాలన్నారు. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని వ్యక్తపరిచారు. తెలంగాణ అమర వీరులకు అండగా నిలవాలని కోరినట్లు వివరించారు. తెలంగాణకు పట్టిన చీడ పీడ వదలాలంటే కోదండరామ్ సహకారం అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుందన్నారు.