కాంగ్రెస్‌పై విమర్శలతో ప్రజలను మభ్యపెట్టలేరు
ప్రజలకిచ్చిన హావిూలపై సమాధానం ఇచ్చుకోవాల్సిందే
మాజీమంత్రి శ్రీధర్ బాబు
కరీంనగర్,అక్టోబర్5 (జనంసాక్షి): ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హావిూలను అమలు చేయకుండా కాంగ్రెస్‌పై నిందలు మోపిన కెసిఆర్‌కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. ఆర్టీసీ సమ్మెను నివారించడంలో ప్రభుత్వంపూర్తిగా విఫలం అయ్యిందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి ఆర్టీసీని కాపాడడంలో ఐదేళ్లుగా ఎందుకు దృష్టి పెట్టలేదన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలించడం చేతకాక ఆర్టీసిని నిండా ముంచే పని చేశారని అన్నారు. మాటతప్పిన ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని శనివారం నాడిక్కడ అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే గత ఐదేళ్లలో ఏం చేశారో చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఇన్నాళ్లూ ప్రజలను మాటలతో మభ్యపెట్టిన ఏకైక ప్రభుత్వం ఇదేనన్నారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తే ప్రజలు నమ్మరని ఆ కాలం పోయిందన్నారు. ప్రజలు ఎవరేంటన్నది బాగా తెలుసుకున్నారని అన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హావిూని నెరవేర్చకుండా ప్రజలను దగా చేసిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాల, జేఎన్‌టీయూ రెండు కళాశాలలు, 50 మోడల్ స్కూళ్లు, పాస్‌పోర్టు కేంద్రం, కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేశామని అన్నారు. అయితే టిఆర్‌ఎస్ హయాంలో ఈ నాలుగేళ్లలో శాతవాహన యూనివర్సిటీకి వీసీని నియమించలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అప్పర్‌మానేరు, వరదకాలువ ప్రాజెక్టుల పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసిన పాపాన టీఆర్‌ఎస్ లేదని అన్నారు. ఇవన్నీ గమనించి ప్రజలు తగినసమయం కోసం చూస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం కేటీఆర్ చేసిన పోరాటమేమిటో, ఏ జైళ్లో ఉన్నాడో, ఎన్ని కేసులు నమోదయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను దగా చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించాడని, అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హావిూని మరిచారా అని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొట్టి ఇప్పుడు అలా తాను అనలేదని అనడం ఆయనకే చెల్లిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు హావిూలుగానే మారాయని, మిషన్ భగీరథ కాసుల కక్కుర్తికే పెట్టారని, ఎస్సీ, ఎస్టీల 12 శాతం రిజర్వేషన్ అటకెక్కిందని అన్నారు. హావిూలను మరచి కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.