కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న.. 

బండ్ల గణెళిష్‌, భూపతిరెడ్డి
– పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన రాహుల్‌ గాంధీ
– బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుంది
– ఎమ్మెల్సీ భూపతి రెడ్డి
– కాంగ్రెస్‌ అధిష్టానం సూచనమేరకు ముందుకెళ్తా
– సినీ నటుడు, నిర్మాత బండ్ల గణెళిష్‌
ఢిల్లీ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సినీనటుడు, నిర్మాత బండ్ల గణెళిష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో అధ్యక్షుడు రాహుల్‌ నివాసానికి వెళ్లిన ఇద్దరు ఆయన సమక్షంలో తమ మద్దుతుదారులతో కలిసి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. వీరి వెంట రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ భూపతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని  తెలిపారు. ఉద్యోగాలు లేవని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. నిజామాబాద్‌ రూరల్‌ టికెట్‌ తనకే వస్తుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు అవమానాలు, అన్యాయాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ ద్రోహులకు టీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. అందుకే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి మారుతున్నానని వెల్లడించారు. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు. 14 సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని నిర్మించామని, కానీ పార్టీని వీడిపోవాల్సి వస్తోందని అన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో పూర్తిగా కేసీఆర్‌ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల్లో ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. రైతు బంధు పథకం వల్ల అసలైన రైతులకు న్యాయం జరగలేదని, కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదని చెప్పారు. సరైన గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ కేసీఆర్‌ అలా చేయలేదని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణాగా మార్చివేశారని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌ చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారని ధ్వజమెత్తారు. ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్‌, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణత్యాగం చేస్తే 400 మందిని కూడా ఆదుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టిన వాళ్లే కేసీఆర్‌ క్యాబినేట్‌లో ఉన్నారని, నిజాయతీగా ఉండి పార్టీకి సేవ చేసిన వాళ్లను బయటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ బడుగు బలహీనవర్గాలకు చెందిన పార్టీ, ఇవ్వన్నీ కాంగ్రెస్‌ పార్టీతో సాధ్యమౌతుందన్న నమ్మకం ఉందన్నారు.
కాంగ్రెస్‌ అధిష్టానం సూచనమేరకు ముందుకెళ్తా – బండ్ల గణెళిష్‌
కాంగ్రెస్‌ పార్టీ ఏది చెప్తే అది చేస్తానని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. విూ ఇష్టదైవం పవన్‌ కల్యాణ్‌ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు చేరారు అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని సమాధానమిచ్చారు. తనకు పవన్‌ కల్యాన్‌ తండ్రిలాంటి వాడని పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలనేదే తన చిరకాల కోరిక అని చెప్పారు. ప్రజాసేవ చేయాలనిపించి రాజకీయాల్లో వచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా… బేషరతుగా పార్టీలో చేరానని సమాధానమిచ్చారు. రాహుల్‌ గాంధీ ఈ విషయం ప్రస్తావించలేదన్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు. సినిమా రంగం తనకు ప్రాణమన్నారు. రాజకీయాలు వేరు, సినిమా రంగం వేరని చెప్పుకొచ్చారు. అయితే తానెంతో అభిమానించే పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేన చేరకుండా కాంగ్రెస్‌లోకి ఆయన రావడం చర్చనీయాంశంగా మారింది.