కాంగ్రెస్‌ నేతలను ప్రజలే తరిమికొడుతారు

– ప్రతి అభివృద్ధి పనికి కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపడుతున్నారు
– పాలమూరు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
– అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తాం
– నాగం రెండునాల్కుల ధోరణిమార్చుకోవాలి
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
– భూత్పూర్‌ మండలం సిద్ధయ్యపల్లిలో డబల్‌బెడ్‌రూం ఇండ్లకు భూమిపూజ చేసిన మంత్రి
మహబూబ్‌నగర్‌, జులై9(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి పనికి కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భూత్పూర్‌ మండలం సిద్ధయ్యపల్లిలో 300 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు మంత్రి లక్ష్మారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. సమైక్య పాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇందుకు ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులే కారణమని నిప్పులు చెరిగారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక.. వాటిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జైపాల్‌రెడ్డి వంటి నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులు అడ్డుకుంటున్న నాగం జనార్ధన్‌రెడ్డికి తెలివి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. ఒక వైపు కోర్టుల్లో కేసులు వేస్తూ.. మరో వైపు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలంటున్నారని, ఈ రెండు నాలుకల ధోరణిని మార్చుకోవాలని నాగం జనార్ధన్‌రెడ్డికి మంత్రి సూచించారు. పాలమూరు జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్లు.. మంచి చెడులు చూస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.