కాంగ్రెస్‌ లైన్‌ దాటుతోంది..!

 

– కంట్రోల్‌లో ఉండకపోతే తన పదవికి రాజీనామాచేస్తా
– కాంగ్రెస్‌ అధిష్టానాన్ని హెచ్చరించిన సీఎం కుమారస్వామి
బెంగళూరు, జనవరి28(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఇలానే వ్యవహరిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. సిద్దరామయ్య తమ నాయకుడని, ఆయనే సీఎం కావాలని కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కుమారస్వామి సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీటన్నిటిని కాంగ్రెస్‌ నాయకులు గమనిస్తున్నారని, నాకు సంబంధంలేని విషయం ఇదన్నారు. వారు ఇలానే చేస్తానంటే నా పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వారు హద్దులు దాటుతున్నారని, కాంగ్రెస్‌ నేతలే తమ ఎమ్మెల్యేలను అదుపుచేయాలని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు బీజేపీ బేరసారాలు సాగిస్తోందంటూ నిన్నమొన్నటి వరకూ మండిపడిన కుమారస్వామి, తాజాగా భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కే హెచ్చరికలు చేయడంతో కర్ణాటక రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదిలా ఉంటే ఈ వివాదంపై కాంగ్రెస్‌ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం జి పరమేశ్వర స్పందిస్తూ.. ‘సిద్దరామయ్య గొప్ప సీఎం. ఆయన మా సీఎల్పీ నేత. సిద్దరామయ్య సీఎం అయితే బాగుండని ఆ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో తప్పేముంది. మేం ముఖ్యమంత్రి కుమారస్వామితో బాగానే ఉన్నాం అని చెప్పుకొచ్చారు..