కాంగ్రెస్ సీనియన్లకు సోనియా షాక్
తాను పూర్తికాలపు అధ్యక్షురాలినే అని వెల్లడి
విమర్శకులకు గట్టిగా జవాబు చెప్పే ప్రయత్నం
న్యూఢల్లీి,అక్టోబర్16(జనంసాక్షి ): కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా జవాబిచ్చారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మాట్లాడుతూ, పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షురాలిని తానేనని, తాను చురుగ్గా పని చేస్తున్నానని చెప్పారు. విూడియా ద్వారా తనతో మాట్లాడవలసిన అవసరం పార్టీ నేతలకు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో వరుసగా పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీకి చెందిన 23 మంది నేతలు గత ఏడాది ఆగస్టులో సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్ చేశారు. గత నెలలో పంజాబ్ ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ, పార్టీకి పూర్తి కాలపు ప్రెసిడెంట్ లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు. వెంటనే సీడబ్ల్యూసీని సమావేశపరచాలని కోరారు. గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో కపిల్ సిబల్ ఒకరు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు పునర్వైభవం రావాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐకమత్యం అవసరమని, పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం ముఖ్యమని తెలిపారు. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరీ ముఖ్యమని చెప్పారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రెగ్యులర్ కాంగ్రెస్ చీఫ్‌ను ఎన్నుకునేందుకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఈ పక్రియను నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. సంస్థాగత ఎన్నికల గురించి పూర్తి స్పష్టత ఇచ్చే సందర్భం వచ్చిందని చెప్పారు. నేను పూర్తి కాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే కాంగ్రెస్ అధ్యక్షురాలినని తెలిపారు. తాను నిజాయితీని ఇష్టపడతానని, తనకు ఏదైనా చెప్పాలనుకుంటే, విూడియా ద్వారా తనతో మాట్లాడవలసిన అవసరం లేదని సోనియా గాంధీ తెలిపారు. మనమంతా కలిసి స్వేచ్ఛగా, నిజాయితీగా చర్చించుకుందామన్నారు. ఈ గది నాలుగు గోడల వెలుపల తెలియజేయవలసినది సీడబ్ల్యూసీ సమష్టి నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా,
కాంగ్రెస్ పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘెల్ (ఛత్తీస్‌గఢ్), చరణ్‌జిత్ చన్ని (పంజాబ్) ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.