కాంట్రాక్టర్ నిర్లక్ష్యం-విద్యార్థులకు శాపం.

రోడ్డు ఇలా బడికి వెళ్ళేది ఎలా?
– వంతెన నిర్మించక పోవడంతో బడికి దూరం అవుతున్న విద్యార్థులు.
ఫోటో రైటప్: పిల్లడిని భుజాలపై మోసుకొని బడికి తీసుకెళ్తున్న తండ్రి.
బెల్లంపల్లి, జులై 26, (జనంసాక్షి)
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గ్రామస్థుల పాలిట శాపంగా మారింది. దీనికి తోడు బడికి వెళ్లే విద్యార్థులకు రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కొత్తూరు- చిన్న వెంకటాపుర్ గ్రామాల మధ్య రోడ్డు కు వంతెన నిర్మించక పోవడం వల్ల రెండు గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రెండేళ్ల క్రితం ఐటిడిఎ ద్వారా రూ. 4కోట్ల 60 లక్షల నిధులతో రోడ్డు నిర్మించారని, ఫుల్లు రే వాగుపై వంతెన నిర్మించాల్సిన అనంతరం రోడ్డు వేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ రోడ్డు మాత్రమే వేసి వంతెన నిర్మించక పోవడంతో బడికి వెళ్లే విద్యార్థులకు మాత్రమే కాకుండా మిగితా రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసిన రోడ్డు సైతం నాసిరకంగా నిర్మించినట్లు రెండేళ్ల క్రితమే గ్రామస్తులు ఆందోళన చేసినప్పటికీ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహారించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని, వంతెన నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కొత్తూరు, చిన్న వెంకటాపుర్ గ్రామాల కోరుతున్నారు.