కాకీతీయ నుంచి ఓయూ వరకు పాదయాత్ర
వరంగల్,ఫిబ్రవరి28(జనంసాక్షి): లక్ష ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్న సిఎం కెసిఆర్ తన హావిూమేరకు వెంటనే ఉద్యోగ ప్రకటన జారీచేయాలని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఐకాస డిమాండ్ చేసింది. ఈ మేరకు కాకతీయనుంచి ఉస్మానియా వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ మార్చి 6వతేదీ నుంచి నిరుద్యోగుల పాదయాత్ర ఉంటుందని ఐకాస నాయకులు పేర్కొన్నారు. నిరుద్యోగులకు న్యాయంచేయాలని కోరుతూ మార్చి 6నుంచి కేయూలో మొదలయ్యే పాదయాత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముగుస్తుందని వివరించారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను ఓడిస్తామన్నారు. పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలచేయాలని డిమాండ్ చేశారు. 2009 నుంచి 2014 జూన్ వరకు ఉన్న మెస్ బిల్లులను చెల్లించాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీచేయాలని, నిధులు పెంచాలని కోరారు.