కాబూల్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య
– ప్రభుత్వ కార్యాలయ భవనంలో కాల్పులు జరిపిన ముష్కరులు
– 43మంది మృతి, మరో పదిమందికి గాయాలు
కాబూల్, డిసెంబర్25(జనంసాక్షి) : అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కాబూల్‌లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ముష్కరులు జరిపిన దాడిలో 43మంది మృతిచెందగా, మరో పది మందికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఉద్యోగులతో పాటు పౌరులు కూడా ఉన్నట్లు అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. తాజా దాడిని ఈ ఏడాది జరిగిన దాడుల్లోనే అత్యంత దారుణమైనదిగా ప్రభుత్వం అభివర్ణించింది. అయితే ఈదాడికి తామే కారణమని ఇంతవరకూ ఏఉగ్ర సంస్థా ప్రకటించలేదు. అఫ్గాన్ ప్రజా వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాంగణంలో ఈ దాడి జరిగినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. భవనం బయట ప్రధాన ద్వారం వద్ద ఉన్న కారులో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని, అనంతరం లోపలికి చొరబడ్డ సాయుధులైన ఉగ్రవాదులు ప్రతి అంతస్తులోకి ప్రవేశించి తుపాకీలతో కాల్పులు జరిపారని వెల్లడించారు. తమను తాము రక్షించుకునేందుకు కొందరు కిటికీల్లోంచి కిందికి దూకారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ సమయంలో ప్రజలు, ఉద్యోగులు కొన్ని గంటలపాటు భవనంలోనే చిక్కుకుపోయారు. తర్వాత రంగంలోకి దిగిన అఫ్గాన్ సైనికులు భవనంలోకి ప్రవేశించి దాదాపు 350 మందిని రక్షించారు. సాయుధులైన ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇదిలాఉంటే గత నెలలో కాబూల్‌లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకొని 55 మందిని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజా దాడులకు తాలిబన్ సంస్థే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దేశ ప్రజలు లక్ష్యంగా వారు జరిపే ప్రతి దాడి.. ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలను పటిష్ఠ పర్చడమేనని ప్రధాన మంత్రి అబ్దుల్లా వ్యాఖ్యానించారు.