కాబోయే ప్రధాని రాహులే

– పార్టీ అంతా ఐక్యంగా రాహుల్‌ వెంటే ఉంది
– పంజాజ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌
జైపూర్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ జోస్యం చెప్పారు. పార్టీ అంతా ఐక్యంగా రాహుల్‌ వెంట ఉందన్నారు. మంగళవారం ఆయన విూడియాతో సీఎం మాట్లాడుతూ, నేడు దేశ పరిస్థితులు, మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే రాహుల్‌ గాంధీ 2019 ఎన్నికల తర్వాత ప్రధానిగా పగ్గాలు చేపడతారని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ పాక్‌ పర్యటనపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్ధలు కొట్టారు. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ను సిద్దూ హగ్‌ చేసుకోవడంపై నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. పాక్‌ దళాల కాల్పుల్లో ఏటా 300 మంది మన ఆర్మీ సిబ్బంది చనిపోవడం, గాయపడటం జరుగుతోంది. జవాన్ల కారణంగానో. యువ అధికారుల వల్లనో కాకుండా ఆర్మీ చీఫ్‌ ఆదేశాల మేరకే ఈ కాల్పులు జరుగుతుంటాయి’ అని చెప్పారు. పాక్‌ పర్యటన వల్ల చిక్కులు తలెత్తవచ్చనే విషయాన్ని ఆయన (సిద్దూ) అవగతం చేసుకోలేకపోయారని తాను భావిస్తున్నానని అన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ మిత్రుడు కావడంతో ఆయన ప్రమాణ స్వీకారానికి సిద్దూ వెళ్లడాన్ని తప్పు పట్టలేమన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నేత పక్కనే సిద్దూ కూర్చోడాన్ని కూడా తప్పుపట్టలేమని, ఎందుకంటే ఆయన ఎవరో ఎవరికీ తెలియదని, కనీసం తనకు కూడా ఆయన గురించి తెలియదని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. దైవదూషణ నిషేధ చట్టంపై మాట్లాడుతూ, పంజాబ్‌ అనేక కష్టనష్టాలను చవిచూసిందని, మత ఘర్షణల్లో 35,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, మతం పేరుతో రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా చర్యలు తీసుకుంటామని అమరీందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు.