కాశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనచ్చు

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన కేంద్రం

శ్రీనగర్‌,అక్టోబరు 27(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌, లఢక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ పౌరుడైనా అక్కడ భూములు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేసింది. అక్కడ భూములను కొనుగోలు చేసే విధానంపై మోదీ సర్కార్‌ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌ లో భారత దేశానికి చెందిన ఏ పౌరుడైనా అక్కడ భూములను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అములోకి వస్తాయని స్పష్టం చేసింది. అక్కడ నివాసం ఉండే అవకాశాన్ని సైతం అందరికీ ప్రభుత్వం కల్పించింది. కాగా.. వ్యవసాయ భూములను ఇందులో నుంచి మినహాయించింది. ఈ మేరకు కేంద్ర ¬ంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవ్యస్థీకరణ చట్టం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ¬ంశాఖ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌ ప్రాంతానికి చెందని వారు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది తమ ఆకాంక్ష అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అవసరమని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చిని విషయం తెలిసిందే. తద్వారా జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌, మరియు లడఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి అక్కడి చట్టాల్లో కీలక మార్పులు చేస్తోంది.