కాశ్మీర్‌లో నార్వే మాజీ ప్రధానమంత్రి కెల్‌ మాగ్నె పర్యటన


న్యూఢిల్లీ,నవంబర్‌27(జ‌నంసాక్షి): కశ్మీర్‌లో నార్వే మాజీ ప్రధానమంత్రి కెల్‌ మాగ్నె బోండ్విక్‌ పర్యటించడం
వివాదాస్పదమైంది. హురియత్‌ నేతలు మిర్వేజ్‌ ఉమర్‌ ఫరూక్‌, సయ్యద్‌ అలీ షా గిలానీలను ఆయన కలవడాన్ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. శ్రీ శ్రీ రవిశంకర్‌కు చెందిన సంస్థ ఆయనను ఆహ్వానించింది. గత వారం హురియత్‌ నేతలను కలిసి బోండ్విక్‌.. ప్రస్తుతం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఇలాంటి వివాదాల పరిష్కారంలో నార్వేకు ఘన చరిత్రే ఉంది. అందులోనూ బోండ్విక్‌ గతంలో శ్రీలంక తమిళ టైగర్ల సమస్య పరిష్కారం కావడంలో కీలకపాత్ర పోషించారు. అయితే కశ్మీర్‌ అంశాన్ని ద్వైపాక్షిక విషయంగా పరిగణిస్తున్న భారత్‌.. ఐదేళ్లుగా ఏ విదేశీ వ్యక్తీ కశ్మీర్‌లో పర్యటించడానికి, అక్కడి వేర్పాటువాద నేతలను కలవడానికి అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బోండ్విక్‌ నియంత్రణ రేఖకు ఇరువైపులా పర్యటిస్తూ అక్కడి నేతలను కలవడం వివాదానికి కారణమైంది. అయితే ఆయన పర్యటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇటు విదేశాంగ శాఖ, అటు నార్వే ఎంబసీ స్పష్టం చేశాయి. దీంతో నార్వే మాజీ ప్రధానికి కశ్మీర్‌లో ఏం పని? ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను సుష్మా స్వరాజ్‌కానీ, ధోవల్‌గానీ ఇస్తారా లేక పుకార్లను నమ్మమంటారా అని ఒమర్‌ అబ్దుల్లా ప్రశ్నించారు.