కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ప్రధాని మోడీ శ్రీకారం

గోరఖ్‌ పూర్‌ వేదికగా ప్రారంభించిన ప్రధాని
విమర్శించే వారికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరిక
లక్నో,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. తొలి విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక సహా 14 రాష్ట్రాల రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు నగదు జమ చేశారు. మిగిలిన రూ.4వేలను కేంద్రం ఇంకో రెండు విడతల్లో జమ చేయనుంది. ఈ పథకం ద్వారా కోట్లాది రైతులకు లబ్ది చేకూరుతుందని మోదీ అన్నారు. గతంలో రైతులకు ప్రయోజనాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో ఈ పథకం కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏటా మూడు విడుతలుగా రూ.6వేల ఆర్థిక సాయం అందనుంది. ఇందులో భాగంగా తొలి విడుత నగదును జమచేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. ఈ పథకం కింద రూ.75వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్‌ కార్డును జత చేయాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకంపై రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని తాను హెచ్చరిస్తున్నానని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో ఆ పథకాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘జై జవాన్‌, జై కిసాన్‌’ అనే నినాదం చేశారు. ప్రతిపక్షాలు ఇటువంటి రాజకీయాలు చేస్తే రైతుల శాపం విూకు తగులుతుంది. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని నేను రైతులను కోరుతున్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కేవలం పత్రాలకే పరిమితం అయ్యేవి. అవి కార్యరూపం దాల్చకపోయేవి. రైతుల కోసం మంచి పథకాలను వారు అమలు చేయలేదు. రైతులకు అన్ని సదుపాయాలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది. 2020లోపు రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ‘పీఎం-కిసాన్‌ పథకం ద్వారా తొలి దశలో కోటీ ఒక లక్ష మంది రైతుల ఖాతాల్లో డబ్బు వేయనున్నాం. మిగతా రైతులకు కూడా కొన్ని వారాల్లో డబ్బు అందుతుంది. చాలా కాలం నుంచి ఉన్న పంటకు మద్దతు ధర అనే డిమాండ్‌ను మా ప్రభుత్వం నెరవేర్చింది. ప్రధానమంత్రి పంట బీమా పథకం రైతులకు అండగా నిలుస్తోంది. రైతులకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు అందేక్రమంలో మధ్యవర్తులు ఎవరూ లేరు. రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు వేస్తున్నాం. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు రైతులు గుర్తుకు వస్తారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌లలో రెండు రోజుల పర్యటన కోసం మోదీ ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వగ్రామమైన గోరఖ్‌పూర్‌లో జరిగిన ‘కిసాన్‌ సమ్మేళన్‌’లో ఆయన పాల్గొని, పీఎం-కిసాన్‌ స్కీమ్‌ను ప్రారంభించారు. తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.2000ను లబ్దిదారులైన రైతులకు అందజేశారు. ఏడాది కేంద్ర బ్జడెట్‌లో ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన’ను కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక కోటి పది లక్షల మంది రైతులకు మేలు చేకురుతుందని అన్నారు. నిజానికి రైతు రుణాలు రద్దు చేయడం తమకు తేలికవుతుందని, రాజకీయ ప్రయోజనాల కోసం తాము అలా
చేసి ఉండొచ్చని, అయితే తాము మాత్రం అలాంటి కైమ్ర్‌కు ఒడిగట్టమని అన్నారు. రైతు రుణాల మాఫీతో కొద్దిమంది ఎంపిక చేసిన వారికి మాత్రమే మేలు జరుగుతుందని మోదీ వివరించారు. కాగా, ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.