కీలక వడ్డీరేట్లు యధాతథం

ముంబై,డిసెంబర్‌ 6,(జనంసాక్షి): మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయాన్ని ప్రకటించింది. కీలక వడ్డీరేట్లు రెపో, రివర్స్‌ రెపో రేట్లను మార్చలేదు. రెపో రేటు ప్రస్తుతమున్న 6 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌ తెలిపారు. ద్రవ్య పరపతి సవిూక్ష విధానంపై రెండు రోజులు సమావేశమైన పరపతి విధాన కమిటీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. నగదు నిల్వల నిష్పత్తిని కూడా ఆర్‌.బి.ఐ అలాగే ఉంచింది. ఐతే, ఆర్‌.బి.ఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వృద్ది రేటుకు సహకరిస్తాయన్నారు ఉర్జీత్‌ పటేల్‌. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే చర్యల్లో భాగంగానే ఆర్‌.బి.ఐ పలు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదో ద్వైమాసిక పరపతి విధాన సవిూక్ష నిమిత్తం పరపతి విధాన కమిటీ (ఎంసీపీ) మంగళ, బుధవారాల్లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ బుధవారం వెల్లడించింది. ద్రవ్యోల్బణం పెరిగిన దృష్ట్యా ఈ సారి కీలక రేట్లలో మార్పులు చేయలేదని, వాటిని యథాతథంగానే ఉంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ కీలక రేట్ల జోలికి వెళ్లని ఎంపీసీ వరుసగా రెండోసారి ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. చివరిసారి ఆగస్టులో పావు శాతం కోత విధించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాల్గో తైమ్రాసికాలకు ద్రవ్యోల్బణం 4.3 నుంచి 4.7శాతం ఉంటుందని పరపతి విధాన కమిటీ అంచనా వేసింది. కాగా.. వృద్ధి రేటులో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.7శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ గతంలో అంచనా వేసిన విషయం తెలిసిందే. తాజా సమావేశంలోనూ అదే రేటును పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న సంస్కరణలతో వృద్ధిరేటు అంచనాను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. 2018 ఫిబ్రవరి 6, 7 తేదీల్లో చివరి ద్వైపాక్షిక పరపతి విధాన సవిూక్ష జరగనుంది.